27-09-2025 01:37:55 AM
రాయ్‌పూర్, సెప్టెంబర్ 26: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ కుప్పకూలడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. సిల్తారా ప్రాంతంలోని గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
‘ఈ దుర్ఘటన గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరుగురు కార్మికులు చనిపోగా.. మరో ఆరుగురు కార్మికులు గాయాల భారిన పడ్డారని తెలిసింది’ అని ఉన్నతాధికారి వెల్లడించారు. రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ మాట్లాడుతూ... ‘గోదావరి ఇస్పాత్‌లో పై కప్పు కూలిపోవడంతో కొంత మంది కార్మికులు దాని కింద చిక్కుకున్నట్టు మాకు సమాచారం అందింది.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. గాయపడ్డ ఆరుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.