06-01-2026 08:47:56 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్మల్ ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందామని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవాల వేదిక ద్వారా ప్రజలకు పరిచయం చేయగలిగామని అన్నారు. ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమాల నిర్వహణకు ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయాలని, సుందరీకరణ పనులు చేపట్టి మరుగుదొడ్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, నిర్మల్ ఉత్సవాల విజయవంతానికి విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఈఓ భోజన్న, డీవైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, డీపీఆర్వో విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఈడీఎం నదీమ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.