06-01-2026 08:55:18 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): రైతులు సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణపై అవగాహన పెంచుకోవాలని సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రకళ కోరారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రాజేంద్రనగర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చ్ మేనేజ్మెంట్ ఆర్థిక సహాయంతో సేంద్రియ వ్యవసాయంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మంగళవారం సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ పై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే అన్ని రకాల ఉత్పత్తులపై సేంద్రీయ ధ్రువీకరణను సులభంగా పొందవచ్చని తెలిపారు. ఆహార ధాన్యాలు,కూరగాయలు,పండ్లు, పూల తోటలతో పాటు, మిర్చి, పసుపు వంటి సుగంధ ద్రవ్యాల పంటల సాగు చేపట్టిన రైతాంగం సేంద్రీయ ధ్రువీకరణను పొందాలని సూచించారు. ప్రతి ఏడాదికి ఒక హెక్టార్ కి రూ.700 ఖర్చు అవుతుందని తెలిపారు. వీటిలో ఆహార ధాన్యాలు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలకు సేంద్రీయ పంటగా ధ్రువీకరణ పొందేందుకు రెండు సంవత్సరాలు పడుతుంది.
బహు వార్షిక పండ్ల తోటలకు మూడేళ్లు పడుతుందని, ఈ లోగా సేంద్రియ ఉత్పత్తి గానే రైతులు అమ్ముకోవచ్చని తెలిపారు. సేంద్రీయ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రతి ఏట రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం హైదరాబాదులోని సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... వివిధ రకాల పంటలో కషాయాలు, ద్రావణాలు తయారీ వాటిని ఉపయోగించే పద్ధతులు, పంట మార్పిడి విధానంపై ఆయన రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు డి.నరేష్, ఏ.కిరణ్ వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.