26-07-2025 06:50:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా పరిపాలనలో ముఖ్య భూమిక పోషించి జిల్లా కలెక్టర్ శనివారం కడెం మండలంలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పంతులమ్మగా మారి విద్యార్థులకు పాఠ్యాంశాన్ని బోధించింది,. ఆకస్మికంగా జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి బోర్డుపై లెక్కలు మ్యాథమెటిక్స్ సూత్రాలను రాసి విద్యార్థుల చేత సమాధానం చెప్పించుకుంది. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరుపై ఆరా తీసింది.
పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగది వంటి ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. సందర్శనలో భాగంగా కలెక్టర్ స్వయంగా ఏడవ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని దర్పణాలు పాఠాన్ని బోధించి, పటాలు గీయించారు. విద్యార్థుల దగ్గరుండి జవాబులు తెలుసుకున్నారు. తద్వారా సృజనాత్మకత పెరిగేందుకు ప్రయోగాత్మక విద్య ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిరోజూ అన్ని తరగతుల్లో కనీసం 15 నిమిషాల పాటు చదవడం నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అలాగే, కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, యూనిఫార్ములు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ సిలబస్ ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్డు పరీక్షలకు లక్ష్యంగా ఇప్పటి నుంచే చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, ఇతర వసతులపై విద్యార్థులే స్పందించేలా ప్రశ్నలు అడిగారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.ఈ తనిఖీలో ఎంపీడీవో అరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.