calender_icon.png 30 December, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైకల్యం శరీరానికే కానీ.. లక్ష్యసాధనకు కాదు

30-12-2025 12:00:00 AM

దివ్యాంగుడు అశ్విన్  బాలుని ప్రతిభను అభినందన కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : వైకల్యం అనేది శరీరానికి మాత్రమే కానీ తాము అనుకున్న లక్ష్యాల సాధనకు  కాదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగులకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా క్రీడల్లో రాణించిన విజేతలకు బహుమతులను అందజేశారు.  కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు చాలా పట్టుదల మంచి స్ఫూర్తి ఉంటుందని దానివల్లనే సకలాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలియ జేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వాస్తవంగా డిసెంబర్ 3న నిర్వహించుకోవాల్సి ఉందని కానీ ఎన్నికల ప్రవర్తన నియమాలు దృష్ట్యా ఈరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. 

బాలానగర్ ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతూ చదువులో ప్రతిభ కనబరుస్తున్న అశ్విన్ తండ్రి పేరు యాదగిరి ప్రతిభను చూసి కలెక్టర్ ముగ్ధుడయ్యారు.  కేవలం రెండవ తరగతి చదువుకుంటున్న  బుడతడు రాష్ట్రం పేరు చెబితే రాజధాని పేరు, రాజధాని పేరు చెబితే రాష్ట్రం పేరు వెంటనే చెప్పేస్తున్నారు. అతని జ్ఞాపకశక్తికి కలెక్టర్ అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, అడిషనల్ డిఆర్డీఒ సరోజ, మానసిక వైద్యులు డా. పుష్ప, తహసిల్దార్ రమేష్ రెడ్డి , సి.డి.పి. ఒ లు, సూపర్వైజర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.