calender_icon.png 29 January, 2026 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన బల్దియా పోరు

29-01-2026 12:23:51 AM

ఆదిలాబాద్ జిల్లాలో తొలిరోజు 8 నామినేషన్లు దాఖలు

టీటీడీసీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

నామినేషన్లకు గడువు తక్కువతో అభ్యర్థుల్లో హైరానా

ఆదిలాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): జిల్లాలో బల్దియా ఎన్నికల పోరు ప్రారంభమైంది. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం మొదలైంది. తొలి రోజున కేవలం రెండు నామినేషన్ లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన టీటీడీసీ కేంద్రంకు అభ్యర్థుల రాకతో సందడి నెలకొంది. మరో పక్క ఎన్నికల సంఘం నామినేషన్ల దాఖలు చేసేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వ డం.. తొలి రోజు ఇంటి పన్ను బకాయిలు చెల్లించడం.. నామినేషన్ ఫారాలు పూర్తి చేయడం.. వాటిపై గజిటెడ్ అధికారి సంతకం చేయించడం కోసం అభ్యర్తులు పరుగులు పెట్టారు.

తొలి రోజున ఈ పనుల కోసమే సమయం వేచించాల్సి వచ్చింది. మరో రెం డు రోజులు మాత్రమే సమయం ఉండటం తో అభ్యర్తులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ పరిశీలించారు. ఏర్పాటు చేసిన 49 వార్డుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. తొలి రోజు నామినేషన్ దాఖలు సమయం ముగిసే సరికి మొత్తం 8 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. బీ.ఆర్.ఎస్ నుండి 4, కాంగ్రెస్ నుండి 3, బీజేపీ నుండి 1 నామినేషన్ దాఖలు అయ్యాయి. 

స్వతంత్ర అభ్యర్థులు సైతం..

ఎన్నికల సంఘం కేవలం మూడు రోజు లు మాత్రమే సమయం ఇవ్వడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు ఆయా ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండటం.. ఇంకా ఖరారు కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు ఆశావహ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలా వద్దా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ముందు నామినేషన్ వేసిన తర్వాత టికెట్ కోసం ప్రయత్నిద్దామని ఆలోచన చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయా పార్టీల కీలక నాయకుల నుంచి వచ్చిన హామీ మేరకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోపక్క స్వతంత్ర అభ్యర్థులు సైతం బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు నామినేషన్ ఫారాలు తీసుకెళ్తున్నారు. 

నామినేషన్ కేంద్రాల్లో సందడి 

ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, క్యాతన్ పల్లి,లక్షేట్టి పేట, చెన్నూర్ మున్సిపాలిటీల్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో 328 వార్డులు ఉండగా.. వీటి పరిధిలో భారీ గా నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలుస్తోంది. ఆయా కేంద్రాల్లో అభ్యర్థుల సహా యార్థం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల విభాగం సిబ్బంది, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.