05-07-2025 07:46:59 PM
ఉచిత కంటి వైద్య శిబిరంలో కల్వకుర్తి కోర్టు సీనియర్ జడ్జి శ్రీదేవి
కల్వకుర్తి: పేద ప్రజలకు వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్, శంకర నేత్రాలయ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం కల్వకుర్తిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కల్వకుర్తి కోర్టు సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి, ప్రముఖ నేత్ర వైద్యుడు డా. దామోదర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి రోజే 800 మందికి పైగా ప్రజలు హాజరు కాగా 600 మందికి పైగా కంటి పరీక్షలు చేయగా, 35 మందిని శుక్లాల శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. మరో 300 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ సుంకిరెడ్డి సేవలు అభినందనీయమన్నారు.
సమాజానికి ఆయన చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయని పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇటువంటి సేవలు అత్యంత అవసరమన్నారు. డా. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ప్రాంతంలో ఇటువంటి సేవా కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సుంకిరెడ్డి చొరవ అభినందనీయమన్నారు. అనేక మంది కంటి సమస్యలతో బాధపడుతూ చికిత్సల అవకాశాలు లేక బాధపడుతున్నారని గుర్తు చేశారు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి చూపు కల్పించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్సల నుంచి వెనకబడిపోతున్న వారికోసం ఈ కార్యక్రమం ప్రారంభించాం. సేవలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీసీ బాలరాజు, యువ నాయకులు పర్శపాకుల రమేష్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.