20-11-2025 04:55:40 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. గురువారం మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహణ, సౌకర్యాలు , ధాన్యం వాహనాల రాకపోకలను పరిశీలించి, ట్రక్‌షీట్లలో నమోదైన ధాన్యం వివరాలను తనిఖీ చేసి, గత సారి వచ్చిన వడ్లతో పోల్చి ప్రస్తుత సీజన్ రికార్డులను విశ్లేషించారు. అలాగే రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు చేరిన మొత్తం ధాన్యం, ఇంకా ఎంత ధాన్యం రావాల్సి ఉంది అనే అంశాలను సమీక్షించారు. కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతమైన కొనుగోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్‌మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని, లారీ రవాణాలో ఎలాంటి షార్టేజ్ లేకుండా నిశితమైన పర్యవేక్షణ ఉండాలని అన్నారు.ధాన్యం బరువు కొలతలు,తేమ శాతం పరీక్షలు, సంచుల సీలింగ్, రసీదుల జారీ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీసీఓ మనోజ్ కుమార్, ఎంఆర్ఓతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.