29-10-2025 07:41:29 PM
జిల్లాలో భారీ వర్షాల పరిస్థితిపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష..
రేపు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు..
హనుమకొండ (విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిపై జిల్లా అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలోని వర్ష ప్రభావం స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్ష ప్రభావం, పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఎడతెరిపి లేకుండా మరిన్ని రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు విధినిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నందున పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.