calender_icon.png 10 January, 2026 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల ఆరోగ్యం, విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం

09-01-2026 10:10:40 PM

- గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లావణ్య

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లావణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. బాలికల ఆరోగ్యం, విద్య రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు ఆరోగ్యవంతంగా ఉంటూ నాణ్యమైన విద్యను అభ్యసించినప్పుడే వారి జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరిగి, కుటుంబం సమాజ అభివృద్ధికి దోహదపడతారన్నారు.

పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా బలపడతారని, ఇది విద్యలో మెరుగైన ఫలితాలకు దారి తీస్తుందని తెలిపారు. విద్యార్థినులు రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే భోజనం తీసుకోవాలని సూచించారు. నియమిత వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి సకాలంలో పరిష్కరించుకోవచ్చన్నారు. సంక్రాంతి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే విద్యార్థినులను తప్పని సరిగా పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు.

నిరంతర విద్యాభ్యాసం ద్వారానే ఉన్నత చదువులు, మంచి ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, ఆరోగ్య పరీక్షలు, వసతుల వివరాలను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధునయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.