22-08-2025 11:59:29 PM
జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్
చివ్వెంల: శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భవిత కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని, సెప్టెంబర్ ఒకటో తారీకు నుండి అదనపు తరగతులు నిర్వహించాలని, విద్యార్థులు మంచిగా చదివి,మంచిగా రాయటం ప్రాక్టీస్ చెసి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరారు. తదుపరి భవిత కేంద్రం సందర్శించి సైగలతో అంకెలు, కలర్స్ మ్యాచింగ్ లను విద్యార్థులతో చేపించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సోని అనే లబ్దిదారు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే వారికి ఇసుక ఉచితంగా అందజేయాలని తహసీల్దార్ ని ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులను గుర్తించి వారికి మహిళ సంఘాల ద్వారా రూ.లక్ష రుణం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తదుపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాఫ్ హాజరు రిజిస్టర్, ఎయన్సి రిజిస్టర్ లను పరిశీలించారు. ఈడిడి వివరాలు ఇప్పటి వరకు ఈ నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయని డాక్టర్ భవానిని అడిగారు. ఈడిడి క్యాలెండర్ ను పీహెచ్సీలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని, ఆశా కార్యకర్తల ద్వారా ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు అయ్యే విధంగా చూడాలని అన్నారు.