16-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ పాఠశాల కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మ్యూజిక్ గది, తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి బోధనాంశాల పై వారి యొక్క సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు సులువుగా ఆకలింపు చేసుకునే విధంగా విద్యాబోధన చేయాలని, షెడ్యుల్ ప్రకారం సిలబస్ ను పూర్తి చేసి, ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవాలని, విద్యార్ధుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం పరిశుభ్రమమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.
జిల్లా జనరల్ ఆసుపత్రి తనిఖీ
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని జనరల్ మేల్, ఫిమేల్ వార్డులను, పిల్లల వార్డులను తనిఖీ చేసి అక్కడి పేషెంట్ల యొక్క వివరాలను, వారికి అందుతున్న వైద్యసేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ.ఎం.ఆర్.ఎస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ జగదీశ్వర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యులు పాల్గొన్నారు.