05-07-2025 07:16:34 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): పటాన్ చెరు మండలం, ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Pravinya) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, హాస్టల్ పరిశుభ్రత, ఆహార నాణ్యత, బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే బాగా చదవాలని, ధైర్యంగా ఉండాలని విద్యార్థులతో అన్నారు. విద్యార్థుల భద్రత, మౌలిక వసతుల మెరుగుదల కోసం నిరంతరం నిఘా ఉంచాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తనిఖీల్లో భాగంగా టాయిలెట్లు, భోజన శాల, వసతిగృహాలను పరిశీలించి అవసరమైన అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా భద్రంగా ఉండేలా పాఠశాల వాతావరణం ఉండాలన్నారు. అధ్యాపకులు ఎప్పటికప్పుడు విద్యార్థులతో మాట్లాడుతూ వారిని పరిశీలిస్తూ ఉండాలన్నారు. పాఠశాలలో శుభ్రత, పారిశుధ్యంపై రోజువారీ పర్యవేక్షణ నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.