calender_icon.png 5 August, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమిని, కన్నెపల్లి మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన

05-08-2025 06:25:35 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గం లోని భీమిని, కన్నెపల్లి మండలాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన చేశారు. భీమిని మండలంలో పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో గంగా మోహన్ తో కలిసి సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం మల్లిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సందర్శించారు.

లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇండ్లను నిర్మించుకోవాలని, ఇండ్లకు సంబంధించిన బిల్లులను త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల నిర్వహణ సక్రమంగా లేనందున స్థానిక పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. శుభ్రమైన త్రాగు నీటిని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలన్ని కలెక్టర్ సందర్శించి అక్కడి వసతులను తెలుసుకున్నారు.

విద్యార్థినిలకు అందించే మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసరాలను వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, తరగతి గదులు, వంటశాల, మూత్రశాలలు, పరిసరాల పరిశుభ్రత ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థినీలకు అర్థమయ్యే రీతిలో బోధన సాగించాలని, చదువులో వెనకబడ్డ వారిపై ప్రత్యేకమైన దృష్టి నిలపాలని కోరారు. అనంతరం కన్నెపల్లి మండలంలో చేపడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులని ఆయన పరిశీలించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అక్కడ విద్యార్థినిలకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. సకాలంలో మెనూ ప్రకారం పోషక ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కోరారు. పదవ తరగతి విద్యార్థినీలను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థినిలు ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.