28-05-2025 06:59:11 PM
నెన్నలలో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. బుధవారం నెన్నెల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభివృద్ధి, సంక్షేమ పనుల తీరును పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహశీల్దార్ మహేంద్రనాథ్(Mandal Tahsildar Mahendranath) తో విజిట్ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వర్షాకాలం రాబోతుందని, ఈ నేపథ్యంలో మండలంలోని ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మండలంలోని జంగల్ పేటలోని కొత్తగూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. నిరుపేదల కొరకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్దిదారులకు మాత్రమే పథకం ఫలాలు అందే విధంగా జాబితా రూపకల్పనలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ ప్రాంతంలో అటవీ శాఖ అభ్యంతరం చెబుతున్న భూములను పరిశీలించి వాటికి సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. అనంతరం జోగాపూర్, ఆవుడం గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల కోసం త్రాగునీరు, నీడ, ఓ. ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన గోనెసంచులు, టార్పాలిన్లను సమకూర్చడం జరిగిందని తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వారికి కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆయన వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి దేవేందర్రెడ్డి, మండల పంచాయతీ అధికారి, ఎ.పి.ఓ., ఎ.పి.ఎం., ఆర్.ఐ., కార్యదర్శులు సంబంధిత అధికారులు ఉన్నారు.