calender_icon.png 26 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

26-09-2025 12:00:00 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తనిఖీ చేశారు. ఇటీవల ఓ మహిళకు సకాలంలో వైద్యం అందించలేదని, వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె మరణించిందని వైద్యులపై, మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించగా, వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని అంశాన్ని పరిశీలించడానికి నేరుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ కలిసి పర్యటించడం విశేషంగా మారింది.

ఈ సందర్భంగా వారిరువురూ హాస్పిటల్ లోని క్యాజువాలిటీ, ఏఎంసీ, ఐసీయూ, గైనకాలజీ, జనరల్ మెడికల్ వార్డ్ తో పాటు అన్ని వార్డుల్లో  కలియతిరిగి ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు వివరాలు, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వైద్య సేవలు అందించాలని, పరిసరాలు వార్డులను నిత్యం పరిశు భ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సీజనల్ వ్యాధులు చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు, తదితర వైద్య సమస్యలతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారికి వెంట వెంటనే పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారిని అడ్మిట్ చేసి వైద్య  సేవలు అందించాలన్నారు. ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రధాన ఆసుపత్రి వద్ద నిత్యం పోలీస్ అవుట్ పోస్ట్ లో ప్రజలకు, వైద్యులకు రక్షణగా పోలీస్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సిబ్బందికి హాస్పిటల్ వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఎస్పీ తగు సూచనలు చేశారు. హాస్పిటల్లో పేషెంట్ల సహాయకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. హాస్పిటల్లో తీసుకుంటున్న చర్యల గురించి ఇన్చార్జి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్ కలెక్టర్, ఎస్పీలకు వివరించారు.