27-12-2025 08:08:27 PM
జీఓ 252ను సవరించాలని కలెక్టర్‌కు టీఎస్‌జేయూ వినతి
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎం.ఎస్. నెం.252లోని లోపాలను వెంటనే సవరించి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్జేయు) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకగా కలిసి, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతమున్న జీఓ 252 నిబంధనల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మరియు చిన్న పత్రికలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిబంధనలను సరళీకృతం చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జీఓ 252లోని లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా చూడటంతో పాటు, చిన్న పత్రికల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమం లో టీఎస్‌జేయూ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ముతోజు రాము, ప్రధాన కార్యదర్శి దొరి హరికృష్ణ, నాయకులు ఆరూరి శ్రీనివాస్, సదానందం మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.