23-10-2025 02:09:38 AM
నిజామాబాద్, అక్టోబర్ 22 : (విజయ క్రాంతి)ఆర్మూర్ డివిజన్ లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలను పరిశీలించారు. రైతుల నుండి సేకరించిన మొక్కజొన్న పంట నాణ్యతను తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న నిల్వలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
కనీస మద్దతు ధర అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తేమ 14 శాతానికి లోబడి ఉండేలా ఆరబెట్టి, శుభ్రపర్చిన మొక్కజొన్న పంటను కేంద్రాలకు తెచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందాలని సూచించారు. కాగా, కొనుగోలు కేంద్రాలలో రైతులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్యాబ్ ఎంట్రీ చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా కృషి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావు, మార్క్ ఫెడ్ డీ.ఎం మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు.