23-07-2025 04:50:19 PM
మహబూబాబాద్/జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh), రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) బుధవారం ఆయా జిల్లాలోని విద్య, వైద్యశాలల్లో తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గూడూరు మండల కేంద్రంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
విద్యా బోధన తీరుపై విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన మందులను ముందుగా సిద్ధం చేసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రేగొండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాన్ని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. హాస్టల్ లో విద్యార్థులకు అమలు చేస్తున్న మెనూ పరిశీలించారు. వంటగది, తరగతి గదులను, పాఠశాల ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, హాస్టల్ల నిర్వహణ పనితీరుపై ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి వారి చేత నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.