23-07-2025 04:45:57 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ రైల్వే స్టేషన్(Mahabubabad Railway Station)లో 4వ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని, కొత్త రైళ్లకు స్టాపింగ్ కల్పించాలని, ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు అనువైన సౌకర్యాలు లేవని, కొత్తగా మూడో లైన్ నిర్మాణం చేపట్టి, అందుకు తగ్గట్టుగా నాల్గవ ప్లాట్ఫారం నిర్మించడం లేదని దీనితో ప్రయాణికులు రైలు ఎక్కి దిగడం కష్టంగా మారుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడ్డప్పటికీ కొత్తగా రైళ్లకు హాల్టింగ్ కల్పించడం లేదని ఆరోపించారు.
కరోనాకు ముందు అనేక ఎక్స్ప్రెస్ రైళ్లకు జనరల్ బోగీలు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా తర్వాత వాటిని తగ్గించి సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, వీరవిల్లి రవి, వెలుగు శ్రావణ్, మేక వీరన్న, రమేష్, రవీందర్, ఆబోతు అశోక్, అజ్మీర వేణు, మంద శంకర్ తదితరులు పాల్గొన్నారు.