23-07-2025 04:52:56 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం విద్యుదాఘాతానికి గురై ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. వసతి భవనంలో రేకుల షెడ్డుకు విద్యుత్ సరఫరా కావడం, వర్షానికి రేకులు తడవడంతో వాటిని తాకిన ఎనిమిదో తరగతి చదువుతున్న హేమంత్, చరణ్, 9వ తరగతి విద్యార్థి సిద్ధార్థ గాయపడ్డారు. వెంటనే వారిని పాఠశాల సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
బుధవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) జిల్లా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకోగా నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతుండగా, క్షేత్రస్థాయిలో వారికి ఏలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన సిబ్బంది అధికారులు ఉదాసీనత చూపడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని ఆదేశించారు.