28-09-2025 12:34:35 AM
నల్లగొండ జిల్లాలో పురావస్తు శాఖ గుర్తింపు
గుహల్లోని మార్గాలను అన్వేషిస్తే చారిత్రక విశేషాలు
బయటపడే అవకాశాలుంటాయంటున్న చరిత్రకారులు
ఆ.. గుహంతర్భాగాలు సొరంగాలుగా.. అంతస్తులుగా చక్కగా చెక్కినట్టుగా రాతిగోడలు.. అందమైన ఆకృతులతో ఒకచోట ఎరుపు రంగు, మరొకచోట కొంచెం నారింజవర్ణం, గుహలో 90శాతం ఆక్వామెరీన్(నీలి ఆకుపచ్చ)రంగుతో అబ్బురపరుస్తున్నాయి.. రంగుల గుహలు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని కాచరాజుపల్లికి దగ్గర వున్న గుట్టల వరుసలో మునులగుహగా పిలువబడుతున్న ‘గాజుబేడం’ గుహను కొంతకాలం క్రితం పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.
ఇక్కడి కొండలు అగ్నిపర్వతాల చాళ్లు (వరుసలు) అయి ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. విలుప్తమైన అగ్రిపర్వతంలో లావా ప్రవాహంతో ఇట్లాంటి గుహలు ఏర్పడివుంటాయని.. లావా వేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ప్రాకృతికంగా గుహల గోడలకు ఈ రంగులు అద్దివుంటాయని అభిప్రాయపడుతున్నారు.
పునర్లిఖింపబడుతున్న తెలంగాణ చరిత్ర
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్త, కొత్తగుహలు, గుళ్లు, గోపురాలు, శాసనాలు, ఆదిమా నవుల ఆవాసాలు, గుహాచిత్రాలు, సమాధులు అనేకంగా వెలుగు చూస్తున్నాయి. చరిత్రకారులు తెలంగాణ చరిత్ర పట్ల ప్రేమతో అన్వేషిస్తున్నారు. ఇంతకు ముందెరుగనివెన్నో కొత్తప్రదేశాలను కనుగొనడం ద్వారా కొత్త తెలంగాణ చరిత్ర పునర్లిఖింప బడుతున్నది.
ఇటీవల కృష్ణానదీ లోయలో నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో జిల్లా ఆర్కియాలజీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు కొత్తగా రంగుల గుహలను గుర్తించారు. వాటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పునరన్వేషణ చేసింది. ఈ చరిత్ర యాత్రలో బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, అహోబిలం ప్రభాకర్, చంటి, మాగైడ్ లాలూనాయక్ ఉన్నారు.
కొన్ని దేశాల్లోనే ఇలాంటి గుహలు
ఈ గుహలు దేశంలోనే కొత్తవి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి గుహలున్నాయి. ఐస్ లాండ్ లోని ఒక విలుప్త అగ్నిపర్వతంలో కరిగి చిమ్మిన లావా వేడి, వేడిగాలులకు ఏర్పడిన భూమికి 400అడుగుల లోతున ఉన్న ద్రిహ్నుకగిగుర్ అనే గుహ ప్రకృతే స్వయంగా వేసిన హరివిల్లు రంగులతో కనిపిస్తున్నది. మరొకటి చైనాలోని గల్లిన్ ప్రావిస్స్‌లో వున్న రీడ్ ఫ్లూట్ అనే గుహ భూమికి 790 అడుగుల లోతున వున్న గుహ కూడా రెయిన్ బో గుహ.
దీన్ని 1200 సం.ల నుంచి సందర్శిస్తున్నట్టు క్రీ.శ.792 సం.లో టాంగ్ రాజవంశీ యు లు గుహలో రాయించిన శాసనం వల్ల తెలుస్తున్నది. ఈ గుహలో నీలి, ఎరుపు, నారింజ, ఆకు పచ్చ రంగులు కనిపిస్తుంటాయి. ఇ లాంటి గుహలు మరికొన్ని రష్యాలోని యూ రల్ పర్వతశ్రేణులు, ఐర్లాండు, ఉత్తర అమెరికా, మయ న్మార్, మనదేశంలో బెంగాల్‌లో వున్నాయి.
అబ్బురపరిచేలా అంతస్తుల గుహలు
గుహ మార్గం విశాలంగా వుంది. కళ్లు చెరిరే రంగుల గోడలు. అంతస్తుల గుహలు అబ్బురపరుస్తున్నవి. గుహ ముఖంలో వున్న పైఅంత స్తులో రెండుచోట్ల రెండు చెక్కిన విగ్రహాలున్న జాడలున్నవి. సాధారణంగా సున్నపుగుహల్లో ఉండే స్టాలగ్మైట్సి, స్టాలక్టైట్స్ వీటిలో అగుపించలేదు. గుహలలోపలికి వెళ్ల్ళడానికి తగిన వెలుగు లేనందు వల్ల అన్వేషణ పూర్తి కాలేదు. చిత్రమేమిటంటే మేం చూసింది గుట్ట మధ్య లోవున్నగుహ. బయటకు వెళ్లి పరిశీలిస్తే గుట్ట అడుగున లోయలో మరో గుహ ఇవేరంగులతో కన్పించింది. ఎదురుగా వున్నగుట్టలో కూడా ఇట్లాంటి గుహలున్నాయని స్థానికులు చెప్పారు.
గుహలో ఖనిజ సంపన్నమైన రాళ్లు
ఈ గుహలోని రాళ్లు ఖనిజసంపన్న మైనవి. ఈ గుహలకు మంచిదారు లు వేసి విహారయాత్రాస్థలంగా రూపొందించాలి. గుహలోని మార్గాలను అన్వేషిస్తే చారిత్రక విశేషాలు బయటపడే అవకాశాలున్నాయి.
సొరంగాల నుంచి శ్రీశైలం వరకు..
చందంపేట మండలం లోని కాచరాజుపల్లికి దగ్గర వున్న గుట్టల వరుసలో మునులగుహగా పిలువబడుతున్న ‘గాజుబేడం’ గుహ ఆక్వామెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో మెరిసిపోతున్నది. ఈ గుహలోని సొరంగాలు దాదాపు 12 కి.మీ.లు పొడవున్నాయని, వీటిద్వారా వెళితే దేవరచర్ల, ఏలేశ్వరం, శ్రీశైలం దాకా చేరవచ్చని పెద్దలు చెప్తుండేవారని తెలిసింది. భావోజీ అనే వారి తండాలోని గురువు చాలా ఏండ్లక్రితం దీనిలో ఆర్నెల్లు తపస్సు చేసుకుంటూ కనపడ్డాడట. ఆ తర్వాత ఆయన అంతర్ధానమైపోయాడని, ఇంక కనపడలేదని చెప్పుకుంటున్నారిక్కడి ప్రజలు.