28-09-2025 12:37:16 AM
తెలంగాణ, తమిళ సంస్కృతి ప్రతిబింబించే తొమ్మిది రోజుల వేడుక
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగకి శరన్నవరాత్స్రోవాలు, తొమ్మిది రోజులపా టు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయతీ. అయితే, ఇందుకు భిన్నంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న శ్రీ వైష్ణవ కురతాల్వార్ బట్టార్ వంశస్తులు నవరాత్రి సందర్భంగా వినూత్న రీతిలో తొమ్మిది రోజులపాటు బొమ్మలకొలువు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ బొమ్మల కొలువుతో గ్రామంలో తెలంగాణ, తమిళ సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
తమిళనాడులోని శ్రీరంగం నుంచి శ్రీ వైష్ణవ కురతాల్వార్ బట్టార్ వంశస్తులు నాలుగు వందల ఏళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లాలోని కోమటిపల్లి గ్రామానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారు ప్రత్యేకంగా గురు పీఠం ఏర్పాటు చేశారు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున బొమ్మలకొలువు నిర్వహిస్తారు. బొమ్మల కొలువుకు ముందు కలశ స్థాపన చేసి ఎర్రచందనంతో చేసిన పూర్వ కాలం నాటి శ్రీ వేంంకటేశ్వర స్వామి, అలివేలు మంగతాయారు, శ్రీకృష్ణ విష్ణువు సంబంధించినటువంటి దశావతారాలను, లక్ష్మీదేవి అవతారాలను, వివిధ దేవత మూర్తులను విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రోజుకో రకం తీపి పదార్థం
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశయుజ శుద్ధ దశమి వరకు రోజుకు ఒక రకం తీపి పదార్థాన్ని తయారుచేసి ప్రసాదంగా పెడతారు. సాయంత్రం వేళ ముత్తుదువులను పేరంటానికి పిలుస్తారు. దేశం, రాష్ట్రం, గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో తులతూగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని సస్యశ్యామలంగా ఉండాలని పూజలు నిర్వహిస్తారు. మూలా నక్షత్రం రోజున వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నాలుగు శతాబ్దాల కాలం నాటి బొమ్మలతో..
కోమటిపల్లి, మహబూబాబాద్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ కుర్తాల్వార్ వంశస్థులు నాలుగు శతాబ్దాల కాలం నాటి బొమ్మలతో కొలువు నిర్వహించడం విశేషం. శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ, గోదాదేవి చెక్క బొమ్మలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా కాపాడుతున్నారు. అలాగే తమ పూర్వికుల తాళపత్ర గ్రంథాలను కూడా బొమ్మల కొలువులో చేర్చి పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు బొమ్మలకు పూజలు నిర్వహించి విజయదశమి రోజున గ్రామస్తులను ఆహ్వానించి వాయినాలు ఇచ్చి బొమ్మలతో ఆశీర్వచనాలు ఇప్పించి వాటిని కదిలిస్తారు.
- బండి సంపత్ కుమార్,
మహబూబాబాద్, విజయక్రాంతి
సంస్కృతిని పరిరక్షిస్తున్నాం
కురతాల్వార్ వంశం నుంచి 400 ఏళ్లుగా మా సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నాం. తమిళనాడు నుంచి వలస వచ్చిన మాకు ప్రతి ఏటా దసరా పండగ సందర్భంగా బొమ్మల కొలువు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. బొమ్మలకొలువు వల్ల పిల్లలు పెద్దల్లో ఆధ్యాత్మిక భావన, విభిన్న అంశాలపై అవగాహన పెంపొందుతుంది. నాలుగు దశాబ్దాల కాలం బొమ్మలతో పాటు వివిధ పుణ్యక్షేత్రాల సందర్శన సమయంలో సేకరించి తెచ్చిన బొమ్మలను కొలువులో ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ, తమిళనాడు సంస్కృతిని మేలవించే విధంగా బొమ్మల కొలువు కార్యక్రమాన్ని ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తున్నాం.
మడత్తమ్మాల్ శ్రీనివాసచార్యులు