28-07-2025 01:45:31 AM
-సీఎం రమేశ్ చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపించు
-వేదిక నేనే ఏర్పాటు చేయిస్తా.. డేట్, టైం ఫిక్స్ చేయ్
-కేటీఆర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ సవాల్
-కాంగ్రెస్‌ది బీసీ డిక్లరేషన్ కాదు.. ముస్లిం డిక్లరేషన్ అని
కరీంనగర్, జూలై 27 (విజయ క్రాంతి): ‘సీఎం రమేశ్ చేసిన ఆరోపణలు అబద్ధమని చెబుతున్న కేటీఆర్‌కు నేను సవాల్ చేస్తున్నా.. నేనే వేదికను ఏర్పాటు చేసి సీఎం రమేశ్ ను తీసుకొస్తా.. ఆధారాలతోసహా వివరిస్తా.. డేట్, టైం ఫిక్స్ చేయ్.. దమ్ముంటే చర్చకు రా కేటీఆర్’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సవాల్ విసిరారు.
కవితను జైలు నుంచి విడిపిస్తే విలీనం చేస్తామని కేసీఆర్ కొడుకు ప్రతిపాదిస్తే.. బీజేపీ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం డిక్లరేషన్ బిల్లును తీసుకొచ్చిందని, రాష్ట్రంలో 27 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలవుతున్నాయని, అదనంగా బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, తెలంగాణలో వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోతున్నారని, అట్లాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే అని విమర్శించారు.
ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేశ్ చెప్పింది ముమ్మాటికీ వాస్తవమేనని, కేటీఆర్‌కు మొట్టమొదట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించారని, ఎందుకంటే అక్కడ గెలిచే పరిస్థితి లేదన్నారు. చెన్నాడి సుధాకర్‌రావుకు కేసీఆర్ టికెట్ ఖాయం చేశారని, ఆ టైంలో ముడతల చెప్పు, రబ్బర్ చెప్పులతో సీఎం రమేశ్ వద్దకు పోతే..ఆయన ఇచ్చిన నిధులతోపాటు కేసీఆర్‌ను కన్విన్స్ చేయడంవల్లే కేటీఆర్‌కు టికెట్ వచ్చిందని చెప్పారు. అట్లాంటి వ్యక్తి వేల కోట్లు ఎట్లా సంపాదించారో ప్రజలు గ్రహించాలన్నారు.
బీజేపీ కుటుంబ రాజకీయాలకు దూరం..
బీజేపీ మొదటి నుంచి సింగిల్ స్టాండ్‌తోనే ఉంద ని, బీజేపీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, అవినీతి పార్టీలకు బీజేపీ దూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పారు. ‘అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడుతో నడిచే కుటుంబ పార్టీ బీఆర్‌ఎస్, అవినీతి, అక్రమాలతో తెలంగాణను దోచు కున్న పార్టీ బీఆర్‌ఎస్, సంకుచిత రాజకీయాలతో ప్రజల మధ్య ద్వేషం పెంచి రాజకీయ లబ్ధి పొందాలనుకునే పార్టీ బీఆర్‌ఎస్... అట్లాంటి పార్టీతో మేం ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? సీఎం రమేశ్ కూ డా ఇదే చెబుతున్నడు కదా?’ అని మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీ స్వతహాగా పోటీ చేయబోతోందని, ప్రజలంతా బీజేపీవైపు ఉన్నారన్నారు. రాబో యే స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతోందన్నారు. కేటీఆర్‌కు అహం తగ్గలేదని, కనీస సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నడని అన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నడని, కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదు, చేతకాని దద్దమ్మలని అన్నారు. కానీ ప్రధానిని, బీజేపీ నేతలను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, తమ కార్యకర్తలే కేటీఆర్ సంగతి చూస్తారని హెచ్చరించారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో బలిసి సోషల్ మీడియా ద్వారా ఇష్టానుసారం రాయిస్తూ తమపై దుష్ప్రచారం చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వాళ్లను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర..
తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ముస్లిం డిక్లరేషన్ అనే విషవృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించేదాకా ఆ బిల్లును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకు అమలు చేస్తేనే సంపూర్ణ మద్దతిచ్చి బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు.
బీసీ సంఘాలకు సిగ్గు లేదా? బీసీ రిజర్వేషన్లకు వంతపాడుతున్న బీసీ సంఘాల నేతలకు సిగ్గు లేదా? బీసీలకు అన్యాయం చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హిందువులంటే అంత చులకనా? తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వేరే మతాలకు సంబం ధించిన ప్రార్థనా మందిరాలను, మసీదులను కూల్చే దమ్ముందా? రోడ్డుకు అడ్డంగా ఎన్నో ఉన్నా ఎందు కు పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో జూబ్ల్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ నియోజకవర్గంలో 30 శాతం ఓట్లున్న ఒక వర్గం వారిని సంతృప్తి పరిచేందుకు పెద్దమ్మ గుడిని కూల్చినట్లు అర్ధమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తాం, 80 శాతం హిందూ ఓట్లను ఏకం చేస్తామన్నారు.
రాహుల్‌ది ఏ మతం..?
మోదీ కన్వర్టెడ్ బీసీ అయితే...రాహుల్ గాంధీది ఏ కులం? ఏ మతం? చెప్పాలని కాంగ్రెస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తల్లి క్రిస్టియన్, తాత ముస్లింల నుంచి వేరుపడ్డ పార్శీ, ఇగ రాహుల్ ది ఏ మతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అందుకే ఈ దేశం మీద, హైందవ సం స్కృతి మీద అంతలా విషాన్ని గక్కుతున్నాడని, కాం గ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేస్తున్న ఈ దేశ ప్రజల మీద రాహుల్‌కు రోజురోజుకు ద్వేషం పెరుగుతోందన్నారు. అందుకే ముస్లింలకు వంద శాతం రిజర్వే షన్లు ఇచ్చి భారతదేశంలో హిందువులనే మైనారిటీలుగా మార్చే మహా కుట్రకు తెరదీశాడని ఆరో పించారు.