28-07-2025 01:24:12 AM
సరోగసీ పేరుతో అరాచకాలు
చైల్డ్ ట్రాఫికింగ్ బాగోతం బట్టబయలు
స్పెర్మ్ డొనేటర్లకు రూ.4 వేలు చెల్లింపు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సహా ఏడుగురి అరెస్ట్
వెల్లడించిన డీసీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సరోగసీ పేరుతో జరుగుతున్న భారీ మోసం, పిల్లల అక్రమ విక్రయాల చైల్డ్ ట్రాఫికింగ్ బాగోతాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ సహకారంతో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీ సులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ల యజమాని డాక్టర్ అథలూరి నమ్రత (64) సహా ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాల్ ఆదివారం వెల్లడించారు.
నమ్రత నయవంచన
రాజస్థాన్‌కు చెందిన గోవింద్ సింగ్, సోనియా దంపతులు 2024 ఆగస్టులో సంతానం కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. వారికి డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సరోగసీని సూచించి టెస్టుల కోసం రూ.66 వేలు తీసుకున్నారు. మొత్తం ప్రక్రియకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని, రూ.15 లక్షలు చెక్కు, రూ.15 లక్షలు నగదు రూపంలో చెల్లించాలని నమ్రత ఒప్పం దం కుదుర్చుకున్నారు. ఆగస్టులోనే రూ.5 లక్షలు నమ్రత ఖాతాకు బదిలీ చేసిన దంపతులు, సెప్టెంబర్‌లో విశాఖపట్నంలోని సృష్టి సెంటర్ బ్రాంచిలో వారి స్పెర్మ్, ఎగ్ నమూనాలను సేకరించారు.
ఈ ఏడాది మే 2025 నాటికి మొత్తం రూ.35 లక్షలు నమ్రతకు చెల్లించారు.అయితే బిడ్డ పుట్టిన తర్వాత డీఎన్‌ఏ టెస్టులు చేయాలని దంపతులు కోరగా, డాక్టర్ నమ్రత నిరాకరించారు. సరోగసీకి అంగీకరించిన మహిళ భర్త అదనంగా రూ.3.50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని నమ్రత చెప్పడంతో, బాధితులు రూ.2.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత వైజాగ్‌లోని డాక్టర్ కల్యాణి అనే మహిళ ద్వారా ఒక శిశువును అప్పగించి, అది వారి బిడ్డ అని నమ్మించారు.
ఢిల్లీలో శిశువుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించగా, అది తమ డీఎన్‌ఏతో సరిపోలేదని దంపతులు గుర్తించారు. మోసపో యామని గ్రహించిన దంపతులు, ఆ బిడ్డను అసలైన తల్లిదండ్రులకే అప్పగించాలని డాక్టర్ కల్యాణికి తెలిపారు. అనంతరం నమ్రతను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆమె స్పందించకపోవడంతో ఫోన్ నంబర్లు బ్లాక్ చేశారని బాధితులు గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
శిశువు ఖరీదు రూ.90 వేలు
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, శనివారం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలు, మందు లు, మొబైల్ ఫోన్‌లు, డిజిటల్ డివైజ్‌లు, కేసుకు సంబంధించిన రికార్డులు, సరోగసీ పత్రాలతో సహా అనేక కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ది గ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చా యి.
డాక్టర్ నమ్రత పెద్దఎత్తున అక్రమ సరోగసీ, సంతానోత్పత్తి స్కామ్‌ను నిర్వహిస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె విజయ వాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కొండాపూర్‌లలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ల పేరుతో క్లినిక్‌లను నడుపుతున్నారు. ఢిల్లీకి చెందిన గర్భిణీ అయిన అస్సాం మహిళను విశాఖకు విమానంలో రప్పించి, ఆమె నుంచి పుట్టిన శిశువును కేవలం రూ.90 వేలకు కొనుగోలు చేసి, రాజస్థాన్ దంపతులకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇది కేవలం సరోగసీ మోసం కాదని, చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారమని డీసీపీ సాధన రష్మీ పెరుమాల్ స్పష్టం చేశారు.
ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కు మారుడు, న్యాయవాది అయిన పచ్చిపాల జయంత్ కృష్ణ (25) విశాఖపట్నం సృష్టి సెంటర్ మేనేజర్ సి. కల్యాణి అచ్చయ్య మ్మ (40), ల్యాబ్ టెక్నీషియన్, ఎంబ్రియాలజిస్ట్ గొల్లమండల చెన్నా రావు (37), గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియా నిపుణుడు డాక్టర్ నా ర్గుల సదానందం (41), అలాగే బిడ్డను విక్రయించిన అస్సాంకు చెందిన మహమ్మ ద్ అలీ ఆడిక్ (38), అతని భార్య నస్రీన్ బే గం (25) సహా ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
స్పెర్మ్ డొనేటర్లకు రూ.4 వేలు
సృష్టి సెంటర్ ఘటన నేపథ్యంలో రాష్ర్టంలోని అక్రమ స్పెర్మ్ క్లినిక్‌లపై కూడా అధికారులు దృష్టి సారించారు. తాజాగా హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్’పై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరిస్తున్నారని, స్పెర్మ్ డొనేటర్లకు రూ.4 వేల వరకు చెల్లిస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్లినిక్‌కు కూడా అను మతులు లేవని పోలీసులు తెలిపారు. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత సంతానోత్పత్తి లేదా సరోగసీ సేవలకు బలి కావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాణిజ్య సరోగసీ భారతీయ చట్టాల ప్రకారం నిషేధించబడిందని, అటువంటి సరోగసీ చికిత్సలను వాగ్దానం చేసే క్లినిక్‌ల గురించి వెంటనే నివేదించాలని కోరారు. ఎల్లప్పుడూ లైసెన్స్ పొందిన, చట్టబద్ధమైన వైద్య నిపుణులను మాత్రమే సంప్రదించాలని సూచించారు. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న బాధితులు గోపాలపురం పోలీస్ స్టేషన్‌ను లేదా సమీపంలోని పోలీస్ యూనిట్‌ను సంప్రదించాలని కోరారు.
గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు
హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి మాట్లాడుతూ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు అనేక నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని తెలిపారు. ఆ ఆసుపత్రికి సరైన అనుమతులు లేవని, డాక్టర్లు, సిబ్బంది సరైన నిపుణులు కాదని పేర్కొన్నారు. ఆసుపత్రి సర్టిఫికెట్లకు 2021లోనే గడువు ముగిసిందని, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండానే అక్రమంగా ఆసుపత్రిని నడుపుతున్నారని వెల్లడించారు.
కోర్టులో కేసులు నడుస్తున్నందున ఆసుపత్రిని మూసివేస్తున్నామని చెప్పిన నిర్వాహకులు, గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇతర డాక్టర్ల డా. సూరి శ్రీమతి పేర్లను ఉపయోగించుకున్నారని డాక్టర్ వెంకటి పేర్కొన్నారు. డాక్టర్ నమ్రతపై గతంలో మహారాణిపేట పీఎస్, టూటౌన్ పీఎస్ (విశాఖపట్నం), గోపాలపురం పీఎస్ (హైదరాబాద్), కొత్తపేట పీఎస్ (గుంటూరు)లలో పదికి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.