calender_icon.png 28 July, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవ్వరితోనూ కలువం!

28-07-2025 01:20:14 AM

- తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్ ఉంటది

- ‘కాళేశ్వరం’పై కాంగ్రెసోళ్లే ఏదో కుట్ర చేశారు..

- బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరే

- కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి

- పరకాల, భూపాలపల్లి సభల్లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

మహబూబాబాద్, జూలై 27 (విజయ క్రాంతి): ‘తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్ ఉంటది.. ఎవ్వరితోనూ కలిసే ప్రసక్తే లేదు. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదేదో మాట్లాడుతున్నరు.. బీఆర్‌ఎస్ ఎక్కడికీ పోదు.. ఎవ్వరితో కలిసే ఖర్మ మనకు లేదు..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కాళేశ్వరంతో కేసీఆర్‌కు మంచిపేరు వస్తుం దన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు లక్ష కోట్ల అవినీతి అని అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రె స్ నేతలే మేడిగడ్డలో ఏదో చేశారని, అం దుకే అక్కడ ప్రమాదం జరిగిందన్న అనుమానం ఉందని కేటీఆర్ తెలిపారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో  పాల్గొ న్నారు.

పరకాల పట్టణంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్త్మ్రల్ కార్యక్రమం కింద 4,000 మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ, చంటి బిడ్డ తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తోనే బీసీలకు అభ్యున్నతి లభించిందని, కాంగ్రెస్ హామీలో తులం బంగారం ఉత్తదైందని, దోపిడీపై ప్రశ్నించకపోతే నిలువు దోపిడీకి గురికాక తప్పదని సూచించారు.

నాడు.. నేడు..రేపు ఎప్పుడైనా సరే బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం బహుజనులకు వారి న్యాయమైన వాటాను తమ పార్టీ అమలుచేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ మంత్రులు, ప్రభుత్వం సరైన దారికొస్తుందని చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రకటించిన కైటెక్స్ సంస్థను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతల బెదిరింపులతో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు పరిశ్రమలను తెప్పించి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్‌ఎస్ సంకల్పిస్తే, కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 

యూరియా, విత్తనాలు ఇవ్వలేని సీఎం..

సమయానికి యూరియా, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదని కేటీఆర్ మండిపడ్డారు.  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడూ ఎరువులకు కొరత రాలేదని, ఒక్కనాడు కూడా ఎరువుల షాపుల ముందు రైతులు క్యూ కట్టాల్సిన పరిస్థితి కనిపించలేదన్నారు. చారానా కోడికి బారాన మసాలా అన్నట్టు స్వయం సహాయక సంఘాలకు రూ.3,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రేవంత్ సర్కార్ కేవలం 300 కోట్లు ఇచ్చి సంబురాలు చేసుకోమని చెప్పడం దారుణమని చెప్పారు.

సమ్మక్క సారలమ్మ రాణిరుద్రమ వారసుల్లాగా వరంగల్ జిల్లా ఆడబిడ్డలు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తా మని కేటీఆర్ ప్రకటించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో దివంగత మాజీ సర్పంచ్ కొమురయ్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్, మాజీమంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.