calender_icon.png 28 July, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటీసులు ఇచ్చారు.. చర్యలు మరిచారు!

28-07-2025 12:00:00 AM

-మునిదేవునిపల్లిలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

-అక్రమ నిర్మాణమని తెలిసినా పట్టించుకోని అధికారులు

-నిద్రావస్థలో పంచాయతీ, ఇరిగేషన్ యంత్రాంగం

-అభాసుపాలవుతున్న అధికారగణం

కొండాపూర్, జూలై 27: కొండాపూర్ మండల పరిధిలోని మునిదేవునిపల్లి గ్రామంలో శ్రీ రఘునాథ్ డెవలపర్స్ వెంచర్ ప్రహరీ గోడ అనుమతులు లేకుండానే భారీ ప్రహరీ గోడ నిర్మాణం ఏర్పాటు చేశారు. ఈ ప్రహరీ గోడకు అనుమతులు లేవని తెలిసినా నామ మాత్రంగా నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.

శ్రీ రఘునాథ డెవలపర్స్ పేరుతో సర్వే నంబర్లు 194, 196, 16, 92లలో గేటెడ్ కమ్యూనిటీగా ప్రహరీ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి చేపడుతున్నారు.  ఈ భూముల్లో పలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా మట్టి తరలింపు, నాలాల కబ్జా చేపడుతున్నారు. గ్రామ పరిధిలోని రైతుల పొలాలకు వెళ్లే మార్గాలను కూడా మూసివేయడం వల్ల స్థానిక రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వెంచర్ కు సంబంధించి ఫైనల్ లేఔట్ అనుమతి లేకుండానే  ఆకర్షణీయంగా రంగురంగుల బ్రోచర్లు ముద్రించి ప్లాట్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసినా పంచాయతీ అధికారులు ఈ వెంచర్ పై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార అనుమతులు లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేతలు జరిపినప్పటికీ, మళ్లీ అదే తీరు కొనసాగుతోంది. ప్రజలకు నష్టం కలిగించే ఈ విధమైన అక్రమ ప్రాజెక్టులపై వెంటనే విచారణ జరిపి, పనులను నిలిపివేయాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఎంపీవో మౌనం ఎందుకో ?

కొండాపూర్ మండలంలో శ్రీనిధి రఘునాథ్ డెవలపర్స్ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరీ గోడ నిర్మాణం చేయడం నేరమని మండల పంచాయతీ అధికారి రెండవ నోటీసు వెంచర్ యజమానులకు జారీ చేశారు. నోటీసు జారీన ఎంపీవో మాట్లాడుతూ వెంచర్ యజమానులు అనుమతులు లేకుండా నిర్మించిన ప్రహరీ కూడా వారంతట వాళ్ళు కూల్చివేయకపోతే ఐదారు రోజుల్లో మూడవ నోటీసు జారీ చేసి అక్రమ నిర్మాణాలు తొలగిస్తామన్నారు.

నేటికీ పది రోజులైనా ఎంపీవో, సంబంధిత ఇరిగేషన్ అధికారులు మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలోనే అధికారులు అడ్డుకట్ట వేయకుండా ఫిర్యాదు వస్తేనే చర్యలు తీసుకుంటామని భావించడం సరికాదని చెబుతున్నారు. నోటీసులు జారీ చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలను కూల్చకపోవడం, అధికారులు మౌనం పాటించడం పట్ల అధికారులే జవాబు చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.