28-07-2025 12:00:00 AM
- భూములు కబ్జా అయితేనే.. అధికారుల్లో కదలిక..?
- భూముల రక్షణలో అధికారుల ఘోర వైఫల్యం..?
బెల్లంపల్లి అర్బన్, జూలై 25: భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు ఘోర వైఫల్యం చెందుతున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భూ కబ్జాలకి ఆస్కారం లేకుండా అధికారగణం కఠినంగా వ్యవహరి స్తే... కబ్జాకోరులు ఇలా రెచ్చిపోరన్న అభిప్రాయాలు మరో వేలు వినిపిస్తున్నాయి.
ప్రభు త్వ భూములు కబ్జాకి గురికావడం.. ఆ కథనాలు పత్రికల్లో వెలుగు చూడడం.. ఆ పైన అధికారులు ఆగమేఘాల మీద వెళ్లి కబ్జాకు గురైన స్థలంలో ‘ ఇది ప్రభుత్వ స్థలం... ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు ‘ ఉంటాయని బోర్డులు పెట్టడం అందరికీ కనిపిస్తున్న సాధారణ దృశ్యం... ఇక అక్కడితో అధికారుల బాధ్యత తీరిపోయినట్టే.., కబ్జాకోరులు కాసింత టైం ఇచ్చి మళ్లీ అదే భూమిని ఆక్రమించడం బెల్లంపల్లిలో పరిపాటనే విష యం అందరికీ తెలిసిందే... అధికారుల సహకారం లేకుండా సెంటు భూమి కూడా చేతు లు మారవనేది జగమెరిగిన నగ్నసత్యం.
అధికారుల అలసత్వమే...
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారుల అలసత్వం, అవినీతి కోణం భూ కబ్జా దారులకు కొండంత అండగా మారింది. అదే వారికి బలమైంది. కొందరు అధికారు ల్లో మార్పు రానంత వరకు ఈ భూ కబ్జాలకు చెక్ పెట్టడం అసాధ్యం. ప్రభుత్వ భూములను కాపాడడం కూడా ఎవరి తరం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూ కబ్జాలకు శాశ్వత నివారణ అధికారుల దగ్గరే ఉంది. ఇది జరగనంత కాలం భూ కబ్జాలు ఆగవు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, భూ నేరాలు యథాతదమే..
దర్జాగా కబ్జాలు..
బెల్లంపల్లి పట్టణం, దాని పరిసరాల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ భూ కబ్జాదారులు వాలిపోయి జెండా పాతేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాల వెనకాల 170 పీపీ ప్రభుత్వ భూములు నిత్యం కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. ఎకరాలకు ఎకరాలు చేతులు మారుతున్నాయి. పీపీ ల్యాండ్ ను కొనడం, అమ్మడం చట్టరీత్య నేరం. కానీ ఈ భూ చట్టాలను కబ్జాకోరులెవరూ ఖాతరు చేయడం లేదు.
భూములను ఆక్రమిస్తున్నారు.., అమ్మేస్తున్నారు... రెండు రోజుల క్రితం పాలిటెక్నిక్ కళాశాలకి అంటుకొని ఉన్న ఫుడ్ ప్రాసెస్ యూనిట్ కి పక్కన ఉన్న పీపీ ల్యాండ్ ఆక్రమణకు గురైనట్టు తెలుసుకొని వెళ్లిన రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకొని నిబంధనలతో కూడిన హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైతే కానీ ప్రభుత్వ భూముల జోలి కి వెళ్లరు అనడానికి ఈ సంఘటన అద్దం పడుతుంది.
అయితే దానికి సమీపంలోనే ప్రభుత్వ భూమి ఎకరాల కొద్ది అన్యాక్రాంతమైంది. సుమారుగా 10 ఎకరాల పీపీ ల్యాం డ్ ఆక్రమణకు గురైంది. పొరకలతో ఆక్రమిత భూమి చుట్టూ హద్దులు పెట్టుకున్నా రు. ఆ భూమి వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదీ రెవెన్యూ అధికారులు తీరు...
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు...
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిసర ప్రాం తాల్లో ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నిర్భయంగా పత్తి పంటలు సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరోవైపు పాలిటెక్నిక్ కళాశాల చుట్టుపక్కల భారీ అక్ర మ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఓ వైపు అక్రమ సాగు, మరోవైపు అక్రమ కట్టడాలకి ఇక్కడి ప్రభుత్వ భూములు కేరాఫ్‌గా మారా యి అంటే అతిశయోక్తి కాదు.
పలుకుబడి ఉన్న వ్యక్తులు అదే పనిగా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఉన్న ఫలంగా తెగ అమ్మేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఓ మాజీ ప్రతి నిధి అక్రమ నిర్మాణాలతో కోట్లు గడించారని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. పాలిటెక్నిక్ కళాశాల పక్క నుంచి చిన్నబూదకు వెళ్లే బైపాస్ రహదారికి రెండు వైపులా అక్రమ నిర్మాణాలు, ఆక్రమిత సాగు పంట లు కొన్ని దర్శనమిస్తున్నాయి.
ఇందులో అసైన్డ్ భూములకు పట్టాలు కూడా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలి. ఇందులో అక్రమంగా ఆక్రమణకు గురైన భూముల సంగ తి కూడా బయట పెట్టాలి. ఇలా అయితేనే భూ ఆక్రమణల గుట్టు రట్టవుతుందన్న అభిప్రా యాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు ఇప్పటికైనా ఏం చేస్తారో చూడాలి మరి.