28-07-2025 01:41:13 AM
ప్రభుత్వానికి అందజేయనున్న జస్టిస్ పీసీ ఘోష్
ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్
నివేదికపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశం?
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణంలోని అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (కాళేశ్వరం కమిషన్) చేపట్టిన విచారణ పూర్తి అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే కమిషన్ సిద్ధం చేసిన నివేదికను ప్రభుత్వా నికి అందజేయనున్నట్టు సమాచారం.
గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల కుంగుబాటు, నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలను బహిర్గతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. గత పదహారు నెలలు కమిషన్ విచారణ చేపట్టింది.
ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అందరినీ విచారించింది. వీరిలో రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఐఏఎస్‌లు, ఈఎన్సీలు, ఇంజినీర్లు, నిర్మాణ సం స్థలు, గత ప్రభుత్వ పాలకులైన కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో సహా సాగు నీటి రంగ నిపుణులు, ఇతరులు ఉన్నారు.
జూలై 31 వరకే కమిషన్ గడువు..
జస్టిస్ ఘోష్ కమిషన్‌ను మార్చి 14, 2024లో ప్రభుత్వం నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల కుంగుబాటుపై విచారణ చేపట్టి జూన్ 30, 2024 వరకు నివేదిక సమర్పించాలని గడువు నిర్దేశించింది. అయితే నిర్ణీత గడువులో విచారణ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 31,2024 వరకు కమిషన్ గడువును పొడగించింది.
ఆగస్టులో మరోసారి గడువు పొడగిస్తూ డిసెంబర్ 2024 వరకు సమ యం ఇచ్చింది. అప్పటికీ విచారణ పూర్తి కాలేదు. దీంతో నాలుగోసారి ఫిబ్రవరి 28, 2025 వరకు కమిషన్ గడువును పొడగించింది. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్ 30, 2025 వరకు కమిషన్ కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ అధికారులు, ఇంజినీర్లు, ఇతరుల విచారణ పూర్తి అయినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను విచారించాల్సి ఉండగా ఆరోసారి కమి షన్ గడువును జూలై 31 వరకు ప్రభుత్వం పొడగించింది.
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం విచారణ కమిషన్ గడువును ఆరుసార్లు పొడగించడం గమనార్హం. అయితే మరో మూడు రోజుల్లో జస్టిస్ ఘో ష్ కమిషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు కమిషన్ గడువు పొడగింపుపై ప్రభు త్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీం తో నివేదిక సిద్ధమైనట్టు అందరూ భావిస్తున్నారు. నిర్దేశిత గడువులోగానే కమిషన్ నివే దికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం.
క్యాబినెట్ మీటింగ్ నేపథ్యంలో ఆసక్తి..
జూలై 28వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక సమర్పించడంపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి మంత్రివర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన జరగాల్సి ఉండగా దాని ని 28వ తేదీకి వాయిదా వేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సిద్ధమైంది..త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్న నేపథ్యంలోనే క్యాబినెట్ సమావేశం వాయిదా వేసినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
దీనికితోడు జస్టిస్ పీసీ ఘోష్ ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ జరగనున్న నేపథ్యంలో ఉదయమే విచారణ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తారని సమాచారం. క్యాబినెట్‌లో దీనిపై చర్చిస్తారని తెలుస్తోంది. అయితే కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అటు బీఆర్‌ఎస్ నాయకులకు, ఇటు ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అధికారుల్లో ఆసక్తి నెలకొంది.