14-11-2025 01:14:19 AM
మేడ్చల్, నవంబర్ 13(విజయ క్రాంతి): పట్టణంలో పలు హోటళ్ళు, దుకాణాలను మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి తనిఖీ చేసి నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను పట్టుకున్నారు. పట్టణంలోని కెఎల్‌ఆర్ వెంచర్ శివాజీ విగ్రహం ప్రాంతంలో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తున్న వ్యాపారులకు రూ.45 వేలు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వాడకం పై నిషేధం విధించినప్పటికీ కొంతమంది వినియోగిస్తున్నారని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వ్యాపారులు, ప్రజలు పర్యావరణహితమైన జూటు బ్యాగులు, కాగితపు బ్యాగులు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రామచందర్, తదితరులు పాల్గొన్నారు.