25-10-2025 04:57:20 PM
పట్టణ సీఐ శశిధర్ రెడ్డి..
మందమర్రి (విజయక్రాంతి): నేరాల నిర్మూలన కోసమే సర్కిల్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పట్టణ సిఐ కే శశిధర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని యాపల్, అంగడి బజార్ ప్రాంతాల్లో శనివారం సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో కలసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన వాహన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కాలనీలోని బెల్ట్ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న 29.10 లీటర్ల లిక్కర్ ను(19,897/- రూపాయల విలువగల) స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయనే అనుమానం ఉన్న ప్రదేశాలలో నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని స్పష్టం చేశారు. కాలనీలో కొత్త వ్యక్తులు, నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఎవరైనా కొత్త వారు అద్దెకు వస్తే వారికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలు, గంజాయి సేవించడం వల్ల యువత నిర్వీర్యం అవుతుందన్నారు. పట్టణంలో ఎవరైనా గుడుంబా తయారు చేసినా, అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, లేదా 100 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్‌కు స్పందించవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్, దేవపూర్ ఎస్సై గంగారం, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్ఐ ఆంజనేయులు, అదనపు ఎస్ఐ శ్రీనివాస్, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.