calender_icon.png 13 January, 2026 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతులారం.. కష్టాల తీరం

13-01-2026 12:00:00 AM

ఎండ్లైనా తీరని కంకర రోడ్డు కష్టాలు

ఆపదొస్తే అంబులెన్స్ కూడా రాదేమో!

మోకాళ్ళలోతు గుంతలు, తేలిన కంకరతో పీకల్లోతు కష్టాలు

పాలకులు మారిన తీరని గోడు 

రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు వేడుకోలు

మునుగోడు, జనవరి 12 (విజయక్రాంతి): కంకర తేలిన రోడ్లపై అతి కష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఇదేదో ఒకటి రెండు సంవత్సరాలుగా జరుగుతుందంటే ఏమో అనుకోవచ్చు కానీ సంవత్సరాల తరబడి మండలంలోని కోతులారం ప్రజలది ఇదే తంతు. ఊరు చుట్టూ కంకర తేలి మోకాళ్ళలోతు గుంతలతో రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఆపద వస్తే అంబులెన్స్ కూడా ఊర్లోకి రాదేమో అని గ్రామ ప్రజలు బిక్కుబిక్కు మంటు చూస్తున్నారు.

కంకర తేలిన రోడ్డుతో గ్రామస్తులు నిత్యం కుస్తీ చేస్తూ పాలకులు మారిన మా గ్రామం రోడ్డు తీరు మరకపాయే అని బెంగపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో దాదాపు 20 ఏళ్ల నాడు నిర్మించిన రోడ్డుకి నేటికీ మోక్షం కలగలేదు. ప్రతీ పల్లెకు రోడ్డు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. కానీ  వారు పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తానికి కోతులారం కష్టాల తీరంగా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.                        

కంకర రోడ్డుతో తప్పని కష్టాలు

మండలంలోని కొంపల్లి నుండి కోతులారం ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గ్రామాల మధ్యన కంకర తేలిన రోడ్డుతో ప్రయాణం నరకయాతనగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. కొంపల్లి నుండి కోతులారం, చలమేడ నుండి కోతులారం మీదుగా మండల కేంద్రానికి ప్రజలు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఐదు  కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు మొత్తం కంకర తేలడంతో పలుమార్లు ద్విచక్ర వాహనదారులు కిందపడి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 

ముందు వాహనం వెళ్తే వెనుక వెళ్లలేనంతగా దుమ్ములేస్తోంది.  ఈ దుమ్ము వల్ల శ్వాసకోస, నడుము నొప్పులతో బాధపడుతున్నామని స్థానికులు తెలిపారు. రోజూ ఈ మార్గంలో వెళ్లే డ్రైవర్లు ఈ దారికో దండం అంటున్నారు. రహదారి నిర్మాణం జరగకపోవటంతో ఆర్టీసీ బస్సులు కూడా గ్రామస్తులు కు అందుబాటులో లేవు. గర్భిణులు ప్రతి నెల చెకప్ కోసం అసుపత్రులకు వెళ్లాలన్నా, రోగులను ఆస్పత్రికితీసుకెళ్లాలన్నా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కోతులారం గ్రామ ప్రజలు ప్రయాణానికి పడుతున్న కష్టాలను అర్థం చేసుకొని నూతనంగా రోడ్డు వేసి ఇబ్బందులు తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

మట్టి రోడ్డు ఉన్నప్పుడే నయ్యం.. 

ఈ రోడ్డు గతంలో మట్టి రోడ్డు ఉండేదని, వివిధ గ్రామాల నుండి రాకపోకలు సాఫీగా సాగేవి. ప్రస్తు తం కంకర తేలడం వలన నడవటానికి  ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్డుపై రైతులు, గ్రామస్తులు మండల కేంద్రానికి వెళ్లాలంటే కంకర తేలి ఉండడంతో వాహనాలు తొందరగా చెడిపోయి మరమ్మ తులు చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగులు, గర్బినీలు రోడ్లో వెళ్లే పరిస్థితి లేదు. ప్రభుత్వం పాలకులు తక్షణమే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలి.

- బంగారు రవి, కోతులారం  గ్రామస్తుడు

ప్రభుత్వానికి నివేదిక పంపించాం

కొంపల్లి నుండి కోతులారం వరకు రోడ్డు చాలా వరకు ధ్వంసం అయినది వాస్తవమే. నూతన రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు కావలసిన నిధులకు ప్రభుత్వానికి నివేదిక అందజేశాము. ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా రూ.5 లక్షల వ్యయంతో రోడ్లకు ఇరువైపులా చెట్లను తొలగించి ప్యాచ్ వర్క్ పనులను ప్రారంభించాము. కోతులారం నుండి చల్మెడకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఉంది. బహుశా 2 నెలలలో రోడ్డు నిర్మాణం పనులకు నిధులు మంజూరు కావచ్చు. ప్రభుత్వం ఆర్ అండ్ బి డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు నిధులను మంజూరు చేస్తే తక్షణమే పనులను ప్రారంభించి రవాణా సౌకర్యానికి అంతరాయం కలగకుండా చూస్తాము.

- శ్రీనివాస్, ఏ ఈ ఈ, రోడ్లు, భవనాలు