calender_icon.png 27 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ‘నయావాల్’ శకం

25-08-2025 01:13:06 AM

* టెస్టు క్రికెట్ అంటే ఓపిక, సహనం, నిరీక్షణ. ఇలా పదాలెన్ని చెప్పినా టెస్ట్ క్రికెట్‌కు సరితూగవు. ఒకప్పుడు భారత టెస్టు ఓపెనర్లు తొందరగా ఔటైనా.. తర్వాత ‘నయావాల్’ పుజారా ఉన్నాడులే అని అంతా ధీమాగా ఉండేవారు. గుండెల మీద చేయేసుకుని హాయిగా గడిపేవారు. 

బౌలర్లు ఎంత నిప్పులు చెరుగుతున్నా పుజారా వారికి ఓ అడ్డుగోడలా నిలబడి భారత్ జట్టును ఎన్నో సందర్భాల్లో కాపాడాడు. మరపురాని ఇన్నింగ్స్‌లెన్నో నిర్మించాడు. అభిమానులు ముద్దుగా ‘నయావాల్’ అని పిలుచుకునే పుజారా క్రికెట్‌కు టాటా చెప్పాడు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు పుజారా ‘నయావాలే’ ఇందులో ఎటువంటి సందేహం లేదు. 

  1. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా
  2. బౌలర్ల అడ్డుగోడ పుజారా
  3. రాజ్‌కోట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికలపై సత్తా

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసిపోయింది. ఓ యోధు డు ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు నయావాల్ పుజారా ఆదివారం ప్రకటించాడు. ‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, జట్టుకు అవసరం అయి న వేళ నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని మధురా నుభూతులు. ఎప్పుడో ఒక రోజు వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాల్సిందే. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నా. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పుజ్జీ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 

రఫ్ఫాడించిన రాజ్‌కోట్ కుర్రాడు.. 

ఎన్నో చరిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా రాజ్‌కోట్ నుంచి వచ్చాడు. 2010 లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగిడిన పుజారా మొత్తం 103 టెస్టులు ఆడి మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు చేశాడు. కేవలం ఐదంటే ఐదే వన్డేలు ఆడిన అతడు 51 పరుగులు చేశాడు. చివరిసారిగా భారత్ తరఫున 2023లో ఆ స్ట్రేలియాతో మ్యాచ్ ఆడాడు.

టెస్టుల్లో 7,195 పరుగులు చేసిన పుజారా బౌలర్లకు సింహస్వప్నం. అవతలి ఎండ్‌లో బౌలర్ ఎం త దూకుడుగా బంతులేస్తున్నా కానీ వాటికి అడ్డుగోడలా నిల్చోవడం పుజారా స్పెషాలిటీ. నవతరం క్రికెటర్లలా పుజారా దూకుడైన షాట్లు, స్కూప్‌లు ఆడకపోవచ్చు కానీ పుజారా ఉన్నాడంటే అదో భరోసా.