26-09-2025 12:39:05 AM
నిర్మల్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పీఎం జన్ మన్ కార్యక్రమంలోని అన్ని పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూ నాయర్ కలెక్టర్లను ఆదేశించారు. పీఎం జన్ మన్ (ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్) కార్యక్రమం అమలుపై గురువారం ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా విభూ నాయర్ మాట్లాడుతూ, గిరిజన ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం జన్ మన్ కింద ఆధార్ కార్డుల నమోదు, ఆయుష్ కార్డులు, జన్ ధన్ ఖాతాల వినియోగం, పక్కా గృహాల నిర్మాణం, పీఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని సూచించారు. ఆది కర్మయోగి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే స్థల సేకరణ, మౌలిక వసతుల నిర్మాణ పురోగతి అంశాలను వివరంగా తెలుసుకున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మాట్లాడుతూ, పీఎం జుగా, దర్తి అబా, ఆది కర్మయోగి కార్యక్రమాల్లోని అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన కుటుంబాలను గుర్తించేం దుకు పంచాయతీ కార్యదర్శులు సర్వే చేసి వివరాలను సంబంధిత యాప్లో నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలోని 24 హాబిటేషన్లలో 771 పక్కా గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు.
ఆది కర్మయోగి కింద 9 బ్లాకులు, 32 హాబిటేషన్లలో గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఐదేళ్ల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.