28-09-2025 05:08:09 PM
ఆరు గ్యారంటీలకు అతీగతీ లేదు
2 కోట్ల ‘కాంగ్రెస్ బాకీ కార్డులతో ప్రచారం
మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం తిప్పర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల బాకీ కార్డును ఇంటింటికి తిరిగి పంచారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఒక వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.ఎన్నికల్లో గెలవడం కోసం అలవిగాని 420 హామీలు ఇచ్చారని అన్నారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు ఇచ్చి మరి కొందరైతే బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని మండిపడ్డారు. 100 రోజులు కాదు.. 700 రోజులు అయినా కూడా ఆరు గ్యారంటీలకు అతీగతీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన విషయాన్ని ఎండగట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల ‘కాంగ్రెస్ బాకీ కార్డులను’ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలను.. ముఖ్యంగా రైతులను, మహిళలను, యువతను కాంగ్రెస్ ఎలా వంచించిందో, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ఈ 22 నెలల కాలంలో రేవంత్ సర్కార్ ఒక్కొకరికి ఎంత బకాయి ఉందో మేము ప్రజలకు వివరిస్తామన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఇస్తాం.. గెలిచాక కాడ ఎత్తేస్తాం అంటే కుదరదన్నారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యం కావు అని మేము ఎన్నికల ముందే అంటే.. మాకు ఎలా అమలు చేయాలో తెలుసు అని కాంగ్రెస్ నాయకులు బీరాలు పలికారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేసేదాకా కాంగ్రెస్ మెడలు వంచుతూనే ఉంటాం.. ప్రజల తరుఫున అడుగుతూనే ఉంటామని చెప్పారు.
అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు ఉంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి.. కేసీఆర్ మంచిగ చేస్తుండు కానీ కాంగ్రెస్ ఒస్తే ఇంకా ఏదో ఎక్కువ ఇస్తరు అని నమ్మి ప్రజలు ఓటేశారని,ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు కాంగ్రెస్ భరతం పడతామని హెచ్చరించారు. రేపటి నుండి విస్తృత స్థాయిలో రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి ఈ కార్డులను పంపిణీ చేసి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, మండల నాయకులు కందుల లక్ష్మయ్య, నల్లగొండ మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య, నల్లగొండ, తిప్పర్తి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బడుపుల శంకర్, నాగేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.