02-11-2025 11:57:22 PM
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ’ఫేస్ టు ఫేస్’లో పలువురు వక్తలు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఆరు గ్యారంటీల హామీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను, వ్యవస్థలను కాంగ్రెస్ నాశనం చేసిందని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం. పద్మనాభరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ’ఫేస్ టు ఫేస్’ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్, బీజేపీ తరపున అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గన్ కల్చర్ పెరిగి, లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టిపోయిందని అన్నారు. మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ ఓడిపోతామోననే భయంతో మైనార్టీల ఓట్ల కోసం మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఓటర్లు గెలిపిస్తే జూబ్లీహిల్స్ సమస్యలు పరిష్కరించి, నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. అనంతరం ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టి 23 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్ డివిజన్ లోని ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాలు గత ఎన్నో ఏండ్ల నుంచి అభివృద్ధికి ఎందుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. బోరబండ ప్రాంతంలో ఓటు చోరీ జరుగుతుందని, ఒక లక్షకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, అక్కడి ఓటర్ జాబితాను ఎందుకు ప్రక్షాళన చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విచక్షణతో ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.