02-11-2025 11:59:45 PM
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ
కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుల మధ్య భూముల యుద్ధం
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ భూముల యుద్ధం మంటలు రేగుతున్నాయి. ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రా సంస్థ చేపట్టిన కూల్చివేతలు రాజకీయ వేదికను కుదిపేశాయి. ఈ పరిణామాల మధ్య శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ ఆదివారం బహిరంగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుపై దుమ్మెత్తిపోశారు.నేను సిద్ధం మీరు సిద్ధమా? దమ్ముంటే మీడియా సమక్షంలో చర్చకు రండి అంటూ విసురుగా సవాలు విసిరారు. దీంతో భాగ్యనగర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నా భూములపై ఆధారాలు, రిజిస్ట్రేషన్లు, పహానీలు అన్నీ ఉన్నాయి. మీరు ఏం చూపిస్తారు? అంటూ గాంధీ నేరుగా ప్రశ్నించారు.
తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలను పది సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇది కేవలం రాజకీయ కుట్ర. కానీ ప్రజల ముందు వాస్తవం నిలబడుతుందని గాంధీ ధైర్యంగా ప్రకటించారు.1991లోనే మా కుటుంబం తొమ్మిది మంది కలిసి ఆ భూములు కొనుగోలు చేశాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గింజ భూమి కూడా కొనలేదు. పహానీ, రిజిస్ట్రేషన్, నక్ష, అన్ని పత్రాలు ఉన్నాయి. 2008లో రెవెన్యూ అధికారులు హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్ ద్వారా ఈ భూమి ప్రైవేటు భూమే అని తేలిందని గుర్తు చేశారు అని గాంధీ వివరించారు. తన భూముల చరిత్రను వివరించిన గాంధీ, అదే సమయంలో కృష్ణారావుపై నిప్పులు చిమ్మారు.జగద్గిరిగుట్ట నుంచి స్లిప్పర్స్ వేసుకుని వచ్చిన నువ్వు, ఈరోజు వెయ్యి కోట్లకు పైగా ఎలా ఎదిగావు? ఐడీపీఎల్ భూములను కబ్జా చేయలేదా? 166/6 సర్వే నెంబర్లో అదనంగా ఎకరం కలుపుకుని స్కూల్ కట్టలేదా? పన్ను బకాయిల్లో 30 లక్షలలో 7 లక్షలు మాత్రమే కట్టలేదా? అంటూ గాంధీ ఎదురుదాడి చేశారు.
2014 నుంచి 2024 వరకు ప్రతి ఎమ్మెల్యే ఆస్తులను సీబీఐ, ఈడీ విచారణకు అప్పగించాలి. నేను సిద్ధం మీరు సిద్ధమా? అంటూ మరోసారి సవాలు విసిరారు. తనను 11 ఎకరాల గాంధీ అని పిలుస్తున్న వారిని ఉద్దేశించి వాస్తవాలు తెలుసుకోండి, లేనిపక్షంలో పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. హైడ్రా చర్యలను స్వాగతించిన గాంధీ, అదే సమయంలో పేదలపై జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ఖండించారు.పేదలకు భూములు అమ్మిన వారినే ముందుగా శిక్షించాలి. పాపం ఆ భూములు కొనుగోలు చేసిన పేదలపై బుల్డోజర్లు నడపడం ఏ న్యాయం? అని ప్రశ్నించారు. తాను పదేళ్లపాటు కేసీఆర్, కేటీఆర్ వద్ద ఒక్క పైరవీ కూడా చేయించుకోలేదని, రాజకీయంగా ఎప్పుడూ సూటిగా ఉన్నానని పేర్కొన్నారు. కూకట్పల్లి, ఐడీపీఎల్, బాచుపల్లి, బోరంపేట ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాలపై ఆధారాలతో త్వరలోనే ప్రెస్క్లబ్లో బట్టబయలు చేస్తా. కూకట్పల్లి వీరప్పన్ ఎవరో ప్రజలే తీర్పు చెబుతారని గాంధీ ఘాటుగా హెచ్చరించారు.