calender_icon.png 29 December, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా హక్కుల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం

29-12-2025 01:19:46 AM

గాంధీ, నెహ్రూ, ఇందిర చూపిన బాటలో మా పయనం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

న్యూఢిల్లీలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

దేశనిర్మాణంలో కాంగ్రెస్‌ది కీలక పాత్ర: రాహుల్‌గాంధీ

భారత దేశ ఆత్మ కాంగ్రెస్: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రజా హక్కుల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని, పార్టీ కేంద్రంలో అధికారంలో లేక పోయినా సిద్ధాంతాలకు కట్టుబడే పనిచేస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం (ఇందిరా భవన్)లో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తమ సిద్ధాంతాలు అజరామరమని వర్ణించారు.

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి మహనీయుల అడుగుజాడల్లో ముందుకు వెళ్తామన్నారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో మతపరమైన ద్వేషాలను ప్రోత్సహిస్తోందని, అలాం టి పోకడలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని ప్రకటించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న శుభ తరుణంలో పార్టీ మరిన్ని ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం ఉప సంహరించుకునేంత వరకు తా ము పోరాటం చేస్తామని ప్రతినబూనారు. జనవరి 5వ తేదీ నుంచి దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని ప్రకటించారు.

దేశ నిర్మాణంలో పార్టీది కీలకపాత్ర: సోనియాగాంధీ

ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో, పురోగతిలో కాంగ్రెస్ అసాధారణ పాత్ర పోషించిందని కొనియాడారు. పార్టీపరంగా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని యావత్ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. 1885లో ముంబైలో కేవ లం 72 మంది ప్రతినిధులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు ఒక మహాప్రవాహంలా మారిందని కొనియాడారు. కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ సామాన్యుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుందని, వారి గొంతుకగా శ్రమిస్తుందని ఉద్ఘాటించారు.  

పార్టీ బలహీనుల గొంతుక: రాహుల్‌గాంధీ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, భారత దేశ ఆత్మ అని ఆయన అభివర్ణించారు. బలహీనులు, అణగారిన వర్గాలు, కష్టజీవుల గొంతుకగా తమ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మత విద్వేష రాజకీయాలు, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. సత్యం, అహింస, ధైర్యం అనే ఆయుధాలను ధరించి రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో తమ పార్టీని మరింత బలపేతం చేస్తామని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల చారిత్రక వారసత్వాన్ని గుండెలకు హత్తుకుంటామని, వారి స్ఫూర్తితో పోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను కాపాడటమే తమ అంతిమ లక్ష్యమని వివరించారు.