calender_icon.png 24 November, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను దగా చేసిన కాంగ్రెస్

24-11-2025 12:10:53 AM

-బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య

-బషీర్‌బాగ్ చౌరస్తాలో ఎదుట జీవో ప్రతుల దహనం

ముషీరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 46ను తీసుకొచ్చి బీసీలకు పచ్చి దగా చేసిందని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బీసీలంతా అగ్నిగుండంగా మారి ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట, అంబర్పేటలోని చే నంబర్ చౌరస్తాలో   జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బిసి జాక్ నాయకులు నీల వెంకటేష్ ముదిరాజ్,  సి. రాజేందర్, జి.  అనంతయ్య, పగిళ్ల సతీష్ కుమార్  ఆధ్వర్యంలో రిజర్వేషన్లను కుదిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన 46 జీవోను నిరసిస్తూ జీవో ప్రతులను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఓవైపు హైకోర్టు వాదనలు వినిపించ డానికి గడువున్నప్పటికిని ఆ దిశగా నిబద్ధతతో చర్యలకు ఉపక్రమించాల్సిన ప్రభుత్వం ముందుగానే చేతులెత్తేసి జీవోను విడుదల చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని అందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా చెప్పి బీసీలను మభ్య పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు 22 శాతానికి తగ్గించి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని ప్రశ్నించారు. జీవో నంబర్ 46 ను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రంలో అగ్నిగుండమేనని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు టి. రాజ్ కుమార్ జి.  అనంతయ్య, చిక్కుడు బాలయ్య, భూమ య్య తదితరులు పాల్గొన్నారు.