06-08-2025 12:34:30 AM
సిద్దిపేట, ఆగస్టు 5 (విజయక్రాంతి): హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాటు చేసి పార్టీ నాయకులు, శ్రేణులు వీక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు.
కాళేశ్వరం నిర్మాణం చేపట్టిన తర్వాతనే రైతులకు సాగునీరు అందిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 11 రకాల పెన్షన్లు అర్హులైన వారికి పెంచి ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన ప్రజలకు ఏమాత్రం ఉపశమనం కలిగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సంఘటితమై అన్ని స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఓడితేల సతీష్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు మాత్రమే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ప్రజెంటేషన్ చూసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అందరికీ తెలిసిందన్నారు. కేసీఆర్ ఎంతో కష్టపడి ఇంటింటికీ త్రాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికలిపేస్తామని హెచ్చరించారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం పూర్తి చేశామన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గౌరవెల్లి ప్రాజెక్ట్ నుండి ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.