12-07-2025 05:26:25 PM
నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్...
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పేద ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy Venkat Reddy)లు చెప్పారు. శనివారం వారు నల్లగొండ జిల్లాలో తిప్పర్తి, మాడుగులపల్లి, నల్లగొండ పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. పేద ప్రజలకు అన్ని రకాల సేవ చేసే భాగ్యం కలగడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.
తమ పర్యటనలో భాగంగా మంత్రులు మొదట తిప్పర్తి మండల కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు హాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అక్కడే మొక్కలు నాటారు. మాడుగుల పల్లి మండల కేంద్రంలో రూ. 14.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మండల కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ . 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం నల్లగొండ ఆర్టిసి డిపోలో 40 ఎలక్ట్రిక్ బస్సులను జండా ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ, నకిరేకల్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.