12-07-2025 05:18:32 PM
సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరిన ఆర్డీవో దామోదర్ రావు..
భద్రాచలం (విజయక్రాంతి): ఆధార్ కార్డులో అవసరమైన వివరాల సవరణలు చేసుకునేందుకు ఈనెల 14, 15, 16 తేదీలలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెగా ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు(RDO Damodar Rao) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల ప్రజలు ఆధార్ కార్డులో తప్పులున్నవారు, కొత్త సమాచారం జత చేయాలనుకునేవారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఈ ఆధార్ క్యాంపులో పేరు మార్పు లేదా సవరణ, పుట్టిన తేదీ సవరణ, లింగం మార్పు, చిరునామా సవరణ, మొబైల్ నెంబర్ అప్డేట్, ఫోటో అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్, తల్లిదండ్రుల పేర్లను జోడించడం వంటి సేవలతో పాటు ప్రత్యేకంగా ఐదు, 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా నవీకరించాల్సి ఉంటుందని, అలాగే 0-5 వయసు కల పిల్లల ఆధార్లు తల్లిదండ్రుల పేర్లను జత చేసే అవకాశం కూడా ఈ క్యాంపులో కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఆధార్ క్యాంపులకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని, మంచినీటి సౌకర్యం, ఎవరైనా అస్వస్థకు గురి అయితే అత్యవసర చికిత్సలు అందించడానికి మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశామని, అందుకు నాలుగు మండలాల ప్రజలు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపులకు వచ్చి ఆధార్ కార్డులో ఉన్న సమస్యలను నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు.