05-08-2025 05:52:02 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు గాను ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను ప్రారంభించిందని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించాలన్న లక్ష్యంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.ఈ నిరసనలు ఒక ప్రణాళిక ప్రకారం మూడు దశల్లో జరగనున్నాయని తెలిపారు. మొదటి దశలో భాగంగా ఆగస్టు 5న పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చి తద్వారా ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువచ్చారని చెప్పారు.
రెండవ దశలో ఆగస్ట్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా వంద మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరవుతారని పేర్కొన్నారు.
మూడవ దశలో ఆగస్ట్ 7న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించనుందని తెలిపారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు 29 నుంచి 42 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా అన్ని చర్యలు తీసుకుందని, ఇక రాష్ట్రపతి ఆమోదమే ఆలస్యమని కోట నీలిమ అన్నారు. బీసీలకు న్యాయం చేయడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు