calender_icon.png 20 November, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల ద్రోహి కాంగ్రెస్

20-11-2025 12:00:00 AM

-42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు

-బీసీ రిజర్వేషన్ న్యాయంగా చట్టబద్ధంగా ఇవ్వాలి

-రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్

వికారాబాద్, నవంబర్-19: బీసీలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునే ప్రసక్తేలేదని, చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  బీసీల పట్ల కపట ప్రేమ చూస్తున్నారని తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస  జ్ఞానం లేదని, రెoడున్నర కోట్ల బీసీల మనోభావాలతో  చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు కేవలం బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారని గుర్తుచేశారు.  కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలపెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం కోర్టులో  నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందన్నారు. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుపాలన్నారు.

మోది బడే భాయ్ ముందు రేవంత్ రెడ్డి మోకరిల్లారాని, బీసీల పట్ల రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే ఒక్కసారి కూడా ప్రధాని మోదీ తో రేవంత్ రెడ్డి ఎందుకు చర్చించలేదన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలులో చట్టబద్ధతలను సీఎం రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకోలేదని.. తెలంగాణ సీఎం రాజకీయంగా, పరిపాలనాపరంగా, ఆర్థికంగా విఫలమయ్యారు. కులగణనను మొదలుకుని జీవో దాకా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అడుగడుగున చేసినదంతా మోసం, దగా, నయవంచన తప్ప మరొకటి లేదన్నారు..... అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సింది పోయి, ఏకపక్షంగా దేశ రాజధానికి వెళ్లి ధర్నా పేరిట కేవలం నాటకాలాడారని తప్పుపట్టారు.

రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చేసి..  న్యాయస్థానాల్లో నిలబడని జీఓతో కేవలం బీసీల ఓటు బ్యాంకు కోసం రేవంత్ రెడ్డి మభ్యపెట్టారని ఆయన అన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కి, పార్టీ పరంగా ఇస్తామని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిన నాడే కాంగ్రెస్ మోసం బయటపడిందన్నారు. సర్పంచ్ ఎన్నికలో పార్టీ గుర్తులే ఉండనపుడు కాంగ్రెస్ పార్టీ ఎలా పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు.