calender_icon.png 22 January, 2026 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి

22-01-2026 01:53:07 AM

జిల్లాల తొలగింపు, కాంగ్రెస్ హమీల మోసం ప్రధాన అస్త్రం 

చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల తొలగింపునకు ప్రజలు అనుమతి ఇచ్చినట్లేనని, ఈ అంశాన్ని ప్రజలు స్పష్టంగా గుర్తించి రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల్లో ఇప్పటికే జిల్లాలు ఎత్తేస్తారన్న భయం నెలకొం దని, ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాల్టీల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించనున్నామని, ఉమ్మడి జిల్లాలకు చెందిన వారినే బాధ్యతల్లో పెడతామని కేటీఆర్ తెలిపారు. నేడు లేదా రేపు ఇన్‌చార్జ్‌లను ప్రకటిస్తామని చెప్పారు. 

సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయని, ఎన్నికలకు పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. సర్వేలు కూ డా చేయిస్తున్నామని, వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచా రం కొనసాగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచ్ స్థానాలు గెలవడం సామాన్యమైన విషయం కాదని కేటీఆర్ అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని తాము అనుకోవడం లేదని, అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ అత్యంత సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

ఇప్పటికే ‘బస్తీ బాట’ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, గత పదేళ్లలో తాము చేసిన అభివద్ధి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిన పనులు, ప్రస్తుత సమస్యలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. జిల్లాలు తొలగిస్తార న్న ఆందోళన కొత్త జిల్లాల్లో తీవ్రంగా ఉందని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల తొలగింపునకు అనుమతి ఇచ్చినట్లేనని ప్రజలకు వివరించనున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ అంశాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అస్త్రంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏమి చేసినా అది ఆయన ఇష్టమని, తమ పని తాము చేసుకుంటామన్నారు.

స్థానిక సమస్యలే ఎజెండా.. 

సీఎం కాలికి బలపం కట్టుకొని తిరిగినా సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చా యో ప్రజలందరూ చూశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీఆర్‌ఎస్‌కే ఓటు వేయమని చెబుతున్న పరిస్థితి ఉందని అన్నారు. లేని ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీఎం జవాబు ఇవ్వాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి నిర్ణయాలు స్థానిక నాయకులే తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల కోఆర్డినేటర్లను నియమిస్తు న్నామని, టికెట్లు ఎవరికి ఇవ్వాలన్నది వారే నిర్ణయిస్తారని చెప్పారు.

ఎన్నికలు లేని నాయకులు, ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తామని వెల్లడిం చారు. లోకల్ ఎన్నికలు కావడంతో స్థానికులే ప్రచారం చేస్తారని, స్థానిక సమస్యలనే ఎజెండాగా ముందుకెళ్తామన్నారు. ‘ఫార్ములా విషయంలో గ్రీన్‌కోకు లబ్ధి చేకూర్చామంటూ ఆరోపణలు చేస్తున్నారని, అయితే అదే గ్రీన్‌కోతో దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేటీఆర్ విమర్శించారు. గ్రీన్‌కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. దావోస్‌లో ఏపీ బీజేపీ ఎంపీ సహా పలువురితో మంత్రులు చర్చలు జరుపుతున్నారని, ఇది ఏ విషయానికి సంకేతమని నిలదీశారు. ఒకవైపు ‘ఫార్ములా కుంభకోణం అంటారని, ఆధారాలు చూపాలని, మరోవైపు అదే అంశంపై విచారణ అంటూనే దావోస్‌లో గ్రీన్‌కోతో చర్చలు జరుపుతారని విమర్శించారు.