22-01-2026 01:54:13 AM
కుత్బుల్లాపూర్, జనవరి 21(విజయక్రాంతి): దుండిగల్ సర్కిల్ పరిధి మల్లం పేట్, భౌరంపేట్, గండిమైసమ్మ, బహదూర్ పల్లి ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జోరు గా కొనసాగుతున్నాయి. నిర్మాణదారులు ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్, షెడ్లు, కమర్షియల్ షెటర్ల నిర్మాణాలు కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్నా అధికారు లు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.కాసులకు కక్కుర్తి పడుతూ అక్రమ నిర్మాణాలకు అధికారులు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
మల్లంపేట్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారిలో..
మల్లంపేట్ లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారిలో కనీసం సెట్ బ్యాక్లు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.అదే రోడ్డులో కమర్షియల్ షెటర్ల నిర్మాణం కొనసాగుతున్న కూడా చర్యలు శూన్యం.ప్రధాన రోడ్లలో ఇష్టం వచ్చినట్టుగా షెడ్లు, కమర్షియల్ షెటర్లు నిర్మిస్తూ వ్యాపార సముదాయలుగా కిరాయికి ఇచ్చి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. రోడ్ల పక్కన వీటి వలన వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బహదూర్‌పల్లిలోని అక్రమ సెల్లార్..
బహదూర్ పల్లి నుండి కొంపల్లి వెళ్లే దారిలో ఓ అక్రమ నిర్మాణదారుడు అనుమతులకు విరుద్ధంగా సెల్లార్ తవ్వి అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నాడు. అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తే నోటీసులు ఇచ్చామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్
అక్రమ నిర్మాణాలపై వివరణ కొరకు దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ని ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించడం లేదు.