23-05-2025 11:45:22 PM
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హనుమకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో భాగంగా ఈ రోజు హనుమకొండ జిల్లా భీమదేవరపెల్లి, ఎలుక తుర్తి మండల కేంద్రాల్లో మండల స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మక్సుద్ అలీ. తదనంతరం ఇరువురు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ల ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని, పార్టీ కష్టకాలంలో ఉన్న వారికి, పార్టీకోసం అధిక సమయం కేటాయించే వారికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్తల ఆమోదం తప్పనిసరి అని చెప్పారు.
అన్ని సామాజిక వర్గాలలోను సమానత్వం చేస్తూ నూతన కమిటీలను ఏర్పాటుచేయాలని అన్నారు. పార్టీ పునర్నిర్మాణంలో గతంలో ఎక్కువ కాలం చేసిన వారు కొత్తవారికి స్వచ్ఛందంగా అవకాశాలు కల్పించాలని అన్నారు. పదవిలో ఉండి పార్టీ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపని వారిని గుర్తించి నూతన ఉత్సాహవంతులని నియమించాలని సూచించారు. బ్లాక్ కాంగ్రెస్, మండల పార్టీ, గ్రామ శాఖ అధ్యక్ష కమిటీలను త్వరగతిన ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తల భాగస్వామ్యం కీలకమని, పార్టీ కోసం అకుంఠితంగా పనిచేసిన వారికి నేడు నటరాజన్ నాయకత్వంలో పార్టీ పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలోపేతం కావడానికి, రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించే సత్తా చాటాలని నూతన ఒరవడితో ముందుకు వెళ్తుందని అన్నారు.