calender_icon.png 22 January, 2026 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాలపై రూ.3వేల కోట్ల అదనపు భారం

22-01-2026 12:22:47 AM

కొత్త చట్టంతో పేదల పొట్ట కొడుతున్న మోడీ సర్కార్!

ఉపాధి హామీ  పేరు మార్పుపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన 

పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తల్,జనవరి 21(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ’వీబీజీ - రాంజీ 2025’ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ) బిల్లును తక్షణమే రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి లు డిమాండ్ చేశారు. ఏఐసిసి, టిపిసిసి పిలుపుమేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, కడ్తాల్ మండల పరిధిలోని పల్లె చెల్క తండా, చరికొండ, గ్రామంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా చల్లా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలు మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ నేతలపై బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా తమ మతోన్మాద, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ కొత్త చట్టం వల్ల తెలంగాణ వంటి రాష్ట్రాలపై సుమారు రూ. 3000 కోట్ల అదనపు భారం పడుతుందని, 60 రోజుల పాటు పనులపై నిషేధం విధించడం వల్ల కూలీలు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది భారత లౌకిక రాజ్యాంగానికి విరుద్ధం. వ్యవసాయ సంక్షోభం పెరిగి రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది.

కేంద్రం ఇంతటి దుర్మార్గపు నిర్ణయం తీసుకుంటున్నా, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ మౌనంగా ఉండటం వారి అసమర్థతకు నిదర్శనం‘ అని ఆయన ధ్వజమెత్తారు. ఉపాధి కూలీలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పిసిసి మెంబర్ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, సర్పంచులు మహేందర్ గౌడ్, కర్ణాకర్ గౌడ్, రవి, నాయకులు అద్దాల రాములు, యాట నర్సింహ, శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.