21-07-2025 01:58:57 AM
- కర్ణాటకలో తారాస్థాయికి సీఎం కుర్చీ పోరు
- అగ్రనాయకులు తోసిపుచ్చినా ఆగని ఊహాగానాలు
- కుర్చీ దొరకడం ఈజీ కాదంటూ గతంలో డీకే వ్యాఖ్యలు
- ఎటూ అర్థం కాక అయోమయంలో క్యాడర్
బెంగళూరు, జూలై 20: కన్నడ కాంగ్రెస్‌లో కుర్చీ పోరు రోజురోజుకూ ఎక్కువవు తోంది. ముఖ్యమంత్రి మార్పు పక్కాగా ఉం టుందని పలువురు ప్రచారం చేస్తున్నారు. అటువంటిదేం లేదని పార్టీ అగ్రనాయకత్వం ఈ ఊహాగానాలను కొట్టిపారేసినా కానీ మార్పు ముచ్చట్లకు మాత్రం తెరపడటం లేదు.
తాజాగా ఓ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రి డీకేశివకుమార్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాం శం అయ్యాయి. మైసూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిద్ధూ, డీకే, మల్లికార్జున ఖర్గేతో పాటు మరింత మంది నేతలు పాల్గొన్నారు. తన ప్రసంగం ముగిసిన అనంతరం డీకే శివకుమార్ ఏదో పని మీద వెళ్లిపోయారు.
ఇక సీఎం మాట్లాడేందుకు వచ్చిన సమయంలో కొంత మంది కార్యకర్తలు డీకే గురించి ప్రస్తావించాలని సిద్ధూను అడిగారు. దానికి సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇంట్లో కూర్చునే వాళ్ల గురించి ఎందుకని ప్రశ్నించారు. ‘శివకుమార్ ఇక్కడ లేరు కదా? వెళ్లి కూర్చోండి. ఆయన బెంగళూరుకు వెళ్లిపోయారు.
వెళ్లిపోయిన వారి గురించి కాదు.. వేదికపై ఉన్న నేతల పేర్లను ప్రస్తావించాలి. ఇంట్లో కూర్చున్న వారి గురించి కాదు.. ఇక్కడ ఉన్న వారికి ఆహ్వానం పలకాలి’ అని కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు.
కుర్చీ అంత ఈజీగా దొరకదు
‘మేమంతా కుర్చీ కోసం ఆరాటపడుతుంటే మీరేమో కుర్చీలు ఖాళీగా ఉన్నా కూర్చోవడం లేదు’ అంటూ గతంలో బెంగళూరులో జరిగిన అడ్వొకేట్ల సమావేశం డీకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కుర్చీ కోసమని ఆయన నేరుగా చెప్పకున్నా కుర్చీ అని చెప్పి.. సీఎం పీఠంపై తనకున్న ఆసక్తిని తెలియపరిచారు. ఇక ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య ఇలా వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో ఏం జరుగుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.