calender_icon.png 30 August, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవే పడిగాపులు!

30-08-2025 01:43:14 AM

- కొనసాగుతున్న యూరియా సంక్షోభం

- సిద్దిపేట, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో నిరసనలు

- ప్రధాన మార్గంలో రాస్తారోకోలు

- మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంప్ కార్యాలయ ముట్టడికి యత్నం

- పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన ఉద్రిక్తత

మహబూబాబాద్/బెజ్జంకి/చేవెళ్ల/తిమ్మాపూర్/గజ్వేల్, ఆగస్టు 29: రాష్ట్రంలో యూరి యా సంక్షోభం ఇంకా కొనసాగుతున్నది. రైతులు పొలం పనులు వదలిపెట్టి తమ కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామునే మండల కేంద్రాలకు చేరుకుంటు న్నారు. క్యూలైన్లలో ఆధార్ కార్డులు, పాస్‌బుక్‌లు పెట్టి పడిగాపులు కాస్తున్నారు. వానల ను సైతం లెక్కచేయకుండా ఎరువుల కోసం నించుంటున్నారు. శుక్రవారం వినాయక చవితి పండుగ అయినప్పటికీ కొన్నిచోట్ల రైతులు యూరియా కోసం మండల కేంద్రాలకు వచ్చారు.

శనివారమూ రైతులు పలుచోట్ల యూరియా కోసం రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేయాల్సి వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి శనివారం ఉదయం సమీప గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్లలో నించున్నారు. ప్రధానంగా తూప్రాన్ మార్గంలోని సాయి ఫెర్టిలైజర్స్ వద్ద క్యూలైన్లు కనిపించాయి. వ్యవసాయశాఖ అధికారులు ముందు రోజు టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా సరఫరా చేయడానికి దుకాణదారులు సిద్ధం కాగా, శుక్రవారం వచ్చిన రైతులకూ యూరియా ఇవ్వాలని కొందరు రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచాయి. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్ రైతులకు వచ్చి సముదాయించారు.

ఏడీఏ బాబు నాయక్, ఏవో నాగరాజు అక్కడి చేరుకుని.. గజ్వేల్ గోదాము నుంచి యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. అలాగే బెజ్జంకి మండల కేంద్రంలోని అగ్రోస్, పీఏసీఎస్, సీఏస్సీ కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. రైతుల తాకిడిని గమనించిన ఎస్సై సౌజన్య ఘటనా స్థలానికి చేరుకుని, బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేయించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ యూరియా లభించకపోవడంతో రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ప్రైవేట్ వ్యాపారులు టన్నుల కొద్దీ యూరియా, డీఏపీని లారీల్లో తరలిస్తున్నారని, పీఏసీఎస్‌లకు మాత్రం ఎరువులు ఎందుకు రావడం లేదని నిలదీశారు.

ధర్నా కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయించి వ్యవసాయ అధికారులతో చర్చలు జరిపారు. ఏవో కృష్ణమోహన్ సత్వరం యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అలాగే మహబూబా బాద్ జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన రైతులు జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. తమ కు అవసరమైన యూరియా సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళినాయక్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని సముదాయించారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా పంపిణీ చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మం డలం గుండ్లపల్లి స్టేజీ వద్ద రైతులు యూరి యా కోసం ధర్నా చేపట్టారు. శుక్రవారం ఉదయం డీసీఎంఎస్ సెంటర్‌కు యూరి యా వస్తుందని సమాచారం అందుకుని ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఎంతకీ యూరియా చేరుకోకపోవడంతో ప్రధానమార్గంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనరాకపోకలు నిలిచిపోయాయి.